కన్హయ్య లాల్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కన్హయ్య లాల్‌ను హత్య చేసిన నిందితులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను పోలీసు వ్యాన్‌లో ముఖాలను కప్పి, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. నిందితులిద్దరినీ న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారి తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కపిల్ తోడావత్ విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసు రిమాండ్ కోరే హక్కును పోలీసులు కలిగి ఉండగా, ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి కోరారని, వారిని జూలై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు.
ప్రస్తుతం నిందితులకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని తీసుకుని వెళుతూ ఉండగా.. కనీసం నడవలేని స్థితిలో వారు ఉండడాన్ని చూడవచ్చు. పోలీసు అధికారుల సహాయంతో నడుచుకుంటూ వారు వెళుతున్నారు.
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ తేలీని దారుణంగా హత్య చేయడంలో ప్రధాన నిందితులకు తీవ్రవాద గ్రూపులతో సంబంధాలపై NIA పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను కస్టడీకి తీసుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసులో భాగంగా వారి విచారణను ప్రారంభించనుంది. ఈ క్రూరమైన చర్య ద్వారా దేశ వ్యాప్తంగా జనాల్లో భయాందోళనలు సృష్టించాలని వీరిద్దరూ కోరుకున్నారని NIA తెలిపింది. దాడికి బాధ్యత వహిస్తూ వీరిద్దరూ ఆన్‌లైన్‌లో వీడియోలను పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బెదిరింపులు పంపారు.