టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ అశోక్ కుమార్ హత్య ఘటన దేశంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే..! గతేడాది ఐపీఎల్ కు రైనా సమాయత్తమవుతూ ఉండగా.. రైనా మేనమామ అశోక్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ లోని థరియాల్ గ్రామంలో అశోక్ కుమార్ నివాసంలోకి చొరబడిన దోపిడీ దొంగలు ఆయన కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అప్పటి నుండి ఈ ఘటనలో నిందితుడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు చజ్జూ చైమార్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుటు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు.ఈ సంఘటనకు పాల్పడిన వారిని నెలరోజుల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, దీనికి పథకం పన్నిన మాస్టర్ మైండ్ ఛజ్జూ చైమర్‌ని దాదాపు ఏడాది తర్వాత అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని చైమార్ తెగకు చెందిన ఈ దోపిడీ దొంగలు పలు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యాకాండలకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 11 మంది కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని, వారిలో ఛజ్జూ చైమర్‌తో పాటు షాపూర్ కడీ ఏరియాలో నివసించే సావన్, మొహబత్, రషీద్, షారుక్, నౌస్, అమీర్ అనే యువకులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నట్టు నిర్ధారించారు పోలీసులు.

ఈ దోపిడీ గ్యాంగ్ కు ఛజ్జూ చైమర్ నాయకుడు. బరేలీ ప్రాంతంలోని బహేదిలో నివసించే ఛజ్జూ చైమర్ అక్కడి నుంచే తన ముఠాను నడిపిస్తుంటాడు. పక్కా సమాచారంతో దాడిచేసిన ఎస్టీఎఫ్ పోలీసులు చజ్జూను అరెస్ట్ చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు.ఛజ్జూ చైమర్ కోసం ఏడాది కాలంగా పంజాబ్, తదితర రాష్ట్రాల్లో గాలిస్తున్న పోలీసులు, ఎట్టకేలకు అతన్ని ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. రాత్రి సమయాల్లో దోపిడీ చేస్తామని, పగటి పూట పండ్లు పూలు అమ్ముతూ రెక్కీ నిర్వహిస్తామని వాళ్ళు చెప్పారు. అశోక్ కుమార్ హత్యకు ముందు కూడా ఛజ్జూ చైమర్ గ్యాంగ్‌లోని ఓ మహిళ, పూలు అమ్మేందుకు వచ్చి రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

2020 ఆగస్టు 19న ఈ దోపిడీ ఈ ఘటన జరిగింది. అశోక్ కుమార్ బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడిక్కక్కడే ప్రాణాలు విడిచారు. ఆయన భార్య, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండా యూఏఈ నుంచి హుటాహుటిన భారత్ వచ్చేశాడు. రైనా లేకుండా ఐపీఎల్ 2020 సీజన్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారి ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలంటూ అప్పట్లో పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కు విజ్ఞప్తి చేశాడు. ఆయన కూడా ప్రత్యేకంగా టీమ్ లను నియమిస్తామని వెల్లడించారు.
