More

    సర్పంచ్ ను చంపిన తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం.. ముగ్గురు హతం

    శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో అక్కడికి వెళ్లాయి భద్రతా దళాలు. అర్ధరాత్రి సమయంలో బలగాలు దాక్కున్న ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ సింగ్ రిపబ్లిక్‌తో మాట్లాడుతూ, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. నౌగం శ్రీనగర్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని వారు TRF/LETకి చెందినవారన్నారు. ఇటీవల ఖోన్మో శ్రీనగర్ సర్పంచ్ సమీర్ అహ్మద్ భట్ హత్యలో వీరి ప్రమేయం ఉందని తెలిపారు.

    అంతకుముందు, మార్చి 9 న, శ్రీనగర్‌లోని ఖోన్‌మో ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక సర్పంచ్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. సర్పంచ్ సమీర్ అహ్మద్ భట్ ఆసుపత్రిలో మరణించాడు. ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ ప్రాంతంలోని రైలు మార్గానికి సమీపంలో ఉన్న ఒక ఇంట్లో దాక్కున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై వారు కాల్పులు జరపడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆర్మీ, CRPF, J&K పోలీసులతో సహా భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాళ్లదాడికి పాల్పడి ఆపరేషన్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించిన దుండగుల బృందాన్ని పోలీసులు తరిమికొట్టారు.

    నార్తర్న్ కమాండ్‌లో భద్రతా పరిస్థితి అస్థిరంగా కొనసాగుతోందని, బెదిరింపులు, సవాళ్లను ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.

    Trending Stories

    Related Stories