More

    నరేంద్ర మోదీకి నిద్రలేని రాత్రులు మిగుల్చుతామంటున్న ఖలిస్థానీ ఉగ్రసంస్థ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. క్వాడ్‌ సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి మోదీ వెళుతున్నట్టుగా విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ పదవీ ప్రమాణం చేశాక ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్‌ సదస్సులో చర్చించనున్నారు. సెప్టెంబర్‌ 24న వాషింగ్టన్‌లో జరిగే క్వాడ్‌ సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 23న వైట్‌హౌస్‌లో మోదీ అధ్యక్షుడు బైడెన్‌తో ముఖాముఖి చర్చించే అవకాశాలున్నాయి. బైడెన్‌తో ముఖాముఖి చర్చించడం ఇదే మొదటిసారి కానుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌తో విడిగా చర్చలు జరిపే అవకాశాలున్నట్టుగా విదేశాంగ శాఖ తెలిపింది. ఇక సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటుగా 100 దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్‌గా ఈ సదస్సుని నిర్వహించారు. ఈ ఏడాది అందరూ కలిసి కూర్చొని చర్చించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఉండగా.. ఆయనకు అమెరికాలో నిద్రలేని రాత్రులు మిగుల్చుతామని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అనే ఖలిస్థానీ ఉగ్రసంస్థ బెదిరిస్తోంది. క్వాడ్ నేతల సదస్సు జరిగే రోజున శ్వేత సౌధం ముందు ఆందోళనలను నిర్వహిస్తామని ఎస్ఎఫ్ జే ప్రకటించింది. రైతులపై హింసకు వ్యతిరేకంగానే ఈ నిరసన అని తెలిపింది. ఆ వ్యాఖ్యలపై ప్రధాని భద్రతా విభాగం స్పందించింది. కేవలం ప్రచారం కోసమే ఎస్ఎఫ్ జే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసిందని పేర్కొంది. అందులో ఎక్కువ మంది పాక్ కు చెందిన ఐఎస్ ఐ ఏజెంట్లే ఉన్నారని తెలిపింది. వారు నిరసన చేసే అవకాశాలున్నాయని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా డార్క్ వెబ్ లో వెబ్ సైట్లను క్రియేట్ చేయడంతో పాటు అభ్యంతరకర సందేశాలను ఎస్ఎఫ్ జే పోస్ట్ చేస్తోంది. రైతు ఉద్యమం సందర్భంగా వారిని ఆకర్షించే ప్రయత్నమూ చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే డబ్బు ఇవ్వడంతో పాటు విదేశీ పౌరసత్వం కూడా ఇప్పిస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో 2019 జులై 10న ఎస్ఎఫ్ జేపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారత ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈ గ్రూపులు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలను చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మోదీ అమెరికా పర్యటన ముందు ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేసి పాపులారిటీని సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నాయి.

    Related Stories