More

    కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు..! అంతే దీటుగా సమాధానం చెప్పిన భారతీయులు..!

    కెనడాలో ఖలిస్తానీ ఉన్మాదుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తరచూ దేవాలయాలపైనా, భారతీయులపైనా దాడులు జరుపుతున్న ఖలిస్తానీ మద్దతుదారులు తాజాగా దీపావళి సందర్భంగా మరోసారి అల్లర్లకు పాల్పడ్డారు. ఖలిస్తానీ నినాదాలతో రోడ్లపైకి వచ్చారు. దీపావళి పండుగలను జరుపుకుంటున్న హిందువులపై దాడులకు తెగబడ్డారు. కెనడాలోని మిస్సిస్సాగా పట్టణంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 500 మంది దాకా ఖలిస్తానీ మద్దతు దారులు పాల్గొని భీభత్సం సృష్టించారు. ‘రాజ్ కరేగా ఖల్సా’ ’హిందూస్థాన్ ముర్దాబాద్‘ అంటూ నినాదాలతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే ఈ నినాదాలకు భారతీయులు భయపడతారనుకున్న ఉన్మాదుల అంచనాలను తలకిందులు చేస్తూ,.. భారతీయులు కూడా అంతే ధీటుగా జవాబిచ్చారు. తిరంగా జెండాలతో ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవడంతో వెలుగులోకి వచ్చింది.

    అయితే ఈ ఘర్షణలపై కెనడా పోలీసులు తక్షణమే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఖలిస్తానీ అల్లరిమూకను చెదరగొట్టారు. కానీ ఇప్పటివరకూ ఏ ఒక్కరిపైనా కేసును నమోదు చేయలేదు. దీంతో కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతిస్తున్న విషయం మరోసారి బట్టబయలైంది. ఈ మధ్య కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం ఉనికి రోజురోజుకీ ఎక్కువవుతోంది. కొద్దిరోజుల క్రితం టొరంటోలో హిందూ దేవాలయంపై దాడులకు పాల్పడ్డారు. భారత వ్యతిరేక నినాదాలతో స్వామినారాయణ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయ గోడలపై ‘ఖలిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్’ అనే నినాదాలను రాశారు. ఈ సంఘటనను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అయినా కూడా కెనడా ప్రభుత్వం వీరిపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఖలిస్తానీ ఉన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఖలిస్తానీ రెఫరెండం నే నిర్వహించారు. భారత్ నుంచి సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ సెప్టెంబర్ 19వ తేదీన కెనడాలోని బ్రాంప్టన్ లో రెఫరెండంను నిర్వహించారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్లే అవుతుందని కెనడా ప్రభుత్వానికి సమన్లు జారీచేసింది. దీనివెనకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది.

    అయితే కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదానికి ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతిస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ట్రూడో పార్టీలోని సిక్కు ఎంపీలు గతంలో బహిరంగంగానే భారత వ్యతిరేకత చాటారు. కెనడాలో ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వెళ్ళి స్థిర పడిన వారు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు. వీరికి పాకిస్తానీ ఐఎస్ఐ నుంచి నిధులు కూడా అందుతున్నాయి. సిక్స్ ఫర్ జస్టిస్, పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ లాంటి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు ఈ నిధులను అందుకుని సిక్కుల్లో భారత వ్యతిరేక భావజాలాన్ని పెంచిపోషిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఖలిస్తానీ రెఫరెండం కూడా ఈ సంస్థలే నిర్వహించాయని తెలుస్తోంది. అయితే ఇందులో భారతీయ సిక్కులు ఎక్కువగా పాల్గొనటంలేదు. వీరందరూ ఇప్పటికీ భారత్ తోనే ఉన్నారు. భారత్ నుంచి వలసవెళ్ళిన వారంతా ఖలిస్తానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువగా పాకిస్తాన్ జాతీయులే పాల్గొంటున్నారు. స్వతహాగా వారికి భారత్ పై వ్యతిరేకత ఉండటంతో భారత్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేషంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories