ముకేష్ అంబానీ ఇంటిముందు కారు బాంబుల కేసు చివరిదశకు చేరుకుంటోంది. ఈ కేసులో అరెస్టయిన.. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు ఉన్నతాధికారి సచిన్ వఝే చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్ఐఏ విచారణలో తాజాగా పలు కీలక ఆధారాలు వెలుగుచూశాయి. సచిన్ వఝే నాశనం చేయాలని భావించిన.. కీలక ఆధారాలను స్వాధీనం చేసుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
విచారణలో భాగంగా సచిన్ వఝేను తూర్పూ బాంద్రాలోని మిథి నది వద్దకు తీసుకెళ్లిన ఎన్ఐఏ అధికారులు.. ఆయన సమక్షంలోనే నదిలోనుంచి కీలక ఆధారాలను సేకరించారు. హీరేన్ మృతి కేసులో మరో నిందితుడైన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ కాజీని ఎన్ఐఏ అధికారులు విచారించగా.. వఝే ఆదేశాలతోనే ఆధారాలను మిథి నదిలో పడేసినట్టు చెప్పాడు. దీంతో కాజీ వాటిని ఎక్కడ పడేశాడో తెలుసుకుని నదిలో గాలించారు. ఇందుకోసం ఎన్ఐఏ అధికారులు గజ ఈతగాళ్ల సాయం తీసుకున్నారు. అధికారుల ఆదేశాలతో నదిలోకి దిగిన డైవర్లు, రెండు కంప్యూటర్ సీపీయూలు, హార్డ్‌డిస్క్‌లు, ఒక ల్యాప్‌ట్యాప్, ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న రెండు నెంబర్ ప్లేట్లు, ఓ డిజిటల్ వీడియో రికార్డర్ తో పాటు కొన్ని వస్తువులను వెలికితీశారు. నదిలో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్ వఝే నివాసం ఉన్న హౌజింగ్ సొసైటీది కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలావుంటే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మిథి నదిలో లభించిన కారు నంబర్ ప్లేట్ తనదేనని విజయ్ నాడే అనే వ్యక్తి పోలీసులకు తెలిపారు. MH 20 1539 అనే నంబర్ ప్లేట్ ఉన్న తన కారును.. గత ఏడాది నవంబర్ 16న దొంగిలించారని చెప్పారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, FIR కూడా నమోదు చేశారని, ఫిర్యాదు కాపీ తన వద్ద ఉందని చెప్పారు. తన కారు చోరీ ఫిర్యాదుపై మూడు నెలలుగా తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే అలాంటి రెండు నంబర్ ప్లేట్లను మిథి నది నుంచి ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం తనకు సమాచారం ఇచ్చారని విజయ్ నాడే వెల్లడించారు.
మొత్తానికి కీలక ఆధారాలు లభ్యం కావడం.. సచిన్ వఝే ఆదేశాల మేరకే ఆధారాలు నాశనం చేయాలనుకున్నట్టు కాజీ ఒప్పుకోవడంతో కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టయింది. సచిన్ వఝే నేతృత్వంలోనే కుట్ర జరిగిందనడానికి నదిలో దొరికిన ఆధారాలే కీలకమని అధికారులు చెబుతున్నారు. ఇక కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
మరోవైపు మహేంద్ర స్కార్పియే వెహికిల్ ఓనర్ మున్సుక్ హిరేన్ హత్య కేసును విచారిస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ సైతం సచిన్ వఝేను కీలక నిందితుడిగా భావిస్తోంది. ఇదిలావుంటే, అంతకుముందు రోజు ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సచిన్ వాఝే ఇంట్లో, లెక్కచూపని 62 బులెట్లను అధికారులు కనుగొన్నారు. వీటిలో సర్వీస్ రివాల్వర్ కోసం 30 బులెట్లను వాఝేకు ఇచ్చారని, అయితే, వాటిల్లో కేవలం 5 మాత్రమే రికవర్ అయ్యాయని గుర్తించారు. మిగతా బుల్లెట్లు ఏమయ్యాయనే కోణంలో ఎన్ఐఏ అధికారులు కూపీ లాగుతున్నారు.
ముకేష్ అంబానీ నివాసమైన సౌత్ ముంబై హోమ్ ఆంటిలియా సమీపంలో గత ఫిబ్రవరి 25న ఒక స్కార్ఫియో నిలిపి ఉండటం, అందులో 20 జెలిటెన్ స్టిక్‌లు, బెదరింపు లేఖ కనిపించడం సంచలనం సృష్టించింది. పేలుడు పదార్ధాలు నింపిన ఎస్‌యూవీ యజమాని మన్సుక్ హిరేన్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో మార్చి 13న సచిన్ వఝేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. తన కారును దొంగిలించారంటూ ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేసిన హిరేన్ మార్చి 5న థానేలోని క్రీక్‌లో విగతజీవుడై కనిపించాడు. తన భర్త గత నవంబర్‌లో ఎస్‌యూవీని వఝేకు ఇచ్చినట్టు మృతుని భార్య తెలిపింది. ఇక, తాజాగా కీలక ఆధారాలను నాశనం చేయాలనుకున్నట్టు సచిన్ వఝే అంగీకరించడం.. దానికి సంబంధించి కీలక ఆధారాలు లభ్యం కావడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సచిన్ వఝే కస్టడీ ఏప్రిల్ 3 దాకా వుంది. ఆలోగా మరిన్ని ఆధారాలు సేకరించాలని ఎన్‌ఐఏ కసరత్తు చేస్తున్నారు.