ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్

0
869

మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రపంచవ్యాప్తంగా రైనో(ఖడ్గమృగాల) కోసం తన వాయిస్ ను వినిపించడం మొదలుపెట్టి చాలాకాలం అయ్యింది. జంతు సంరక్షణలో భారతదేశాన్ని అగ్రగామిగా భావిస్తాడు. మోదీ ప్రభుత్వం ఖడ్గమృగాల వేటపై కఠిన ఆంక్షలను తీసుకుని వచ్చింది. గత ఏడాది భారతదేశంలో ఖడ్గమృగాల వేట భారీగా తగ్గిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా తెలపడంతో పలువురు వన్యప్రాణుల సంరక్షకులు మోదీపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. కెవిన్ పీటర్సన్ కూడా మోదీని, ఇక్కడి అధికారులను ప్రశంసించాడు.

“భారతదేశంలో జంతువులను రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న పురుషులు, మహిళలందరికీ, చర్యలు తీసుకుంటున్న నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. జంతు రక్షణలో పాలు పంచుకుంటున్న వారిని చాలా మందిని కలిశాను. వారిని ఎంతో గౌరవిస్తాను! ” అని పోస్టు పెట్టాడు పీటర్సన్.

‘ప్రైడ్ ఆఫ్ అస్సాం’గా పరిగణించబడే ఒంటి కొమ్ము ఖడ్గమృగంను ఒకప్పుడు వేటగాళ్లు విచక్షణారహితంగా వేటాడారు. కాజిరంగా నేషనల్ పార్క్‌లో వాటి సంఖ్య భయంకరంగా తగ్గిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ-పోచింగ్ టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో ఖడ్గమృగాల వేట కేసులను భారీగా తగ్గించగలిగింది. అస్సాంలో వేటను అంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఖడ్గమృగాల కొమ్ములను కాల్చివేయాలని అస్సాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పీటర్సన్ గతంలో ప్రశంసించాడు.

అస్సాంలోని బీజేపీ ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఖడ్గమృగాల వేటను అరికట్టడంలో విజయం సాధించాయి. 2021లో ఒక్క ఖడ్గమృగం మాత్రమే వేటగాళ్లచే చంపబడితే, అంతకుముందు సంవత్సరంలో ఆ సంఖ్య 2గా ఉంది. 2019లో మూడు ఖడ్గమృగాలను వేటాడారు. ఈ విజయానికి యాంటీ-పోచింగ్ టాస్క్ ఫోర్స్ (APTF) కారణమని చెప్పవచ్చు. టాస్క్‌ఫోర్స్ చీఫ్ GP సింగ్ 22 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఖడ్గమృగాల వేటకు సంబంధించిన డేటాను పంచుకున్నారు.