More

    ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన కెవిన్ పీటర్సన్

    ఇంగ్లండ్ మాజీ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఖడ్గమృగాల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పీటర్సన్ మెచ్చుకున్నాడు. ప్రపంచ దేశాధినేతలు మోదీ ప్రభుత్వ అడుగు జాడల్లో నడవాలని సూచించాడు. ప్రధాని మోదీ ఒక హీరో అంటూ కితాబునిచ్చాడీ మాజీ క్రికెటర్. ‘‘భూమిపై ఖడ్గమృగాల కోసం ఎంతో చేస్తున్న అంతర్జాతీయ నేత నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మరింత మంది నేతలు కూడా ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. భారత్‌లో ఖడ్గమృగాల సంఖ్య పెరగడానికి ఈ చర్యలే కారణం. నిజంగా ఎంత గొప్ప హీరో’’ అంటూ ట్వీట్ చేశాడు.

    సెప్టెంబరు 22న అంతర్జాతీయ ఖడ్గమృగ దినోత్సవాన్ని అసోంలో ఘనంగా నిర్వహించారు. ఆ రోజున 2,479 ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోదీ స్పందించారు. ‘‘ఒంటి కొమ్ము గల ఖడ్గమృగం భారత దేశానికి గర్వకారణం. దాని శ్రేయస్సుకు అవసరమైన అన్ని చర్యలూ భారత్‌లో తీసుకుంటాం’’ అని ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన పీటర్సన్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించాడు.

    బహిరంగంగా దగ్ధం:
    ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది ఖడ్గమృగాల కొమ్ములను దగ్దం చేసింది. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని బోకాఖట్‌లో 2,479 ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కొమ్ములను సేకరించే పని దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. వాటిని అటవీ శాఖ ఆధీనంలో రాష్ట్ర ట్రెజరీలలో ఉంచారు. ముఖ్యంగా, ఖడ్గమృగం యొక్క కొమ్ముల పొడిని ఉపయోగించి సాంప్రదాయ చైనీస్ ఔషధాలను తయారు చేస్తారనే అపోహ ఉంది. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరను పొందుతారు స్మగ్లర్లు. వారందరికీ బుద్ధి చెప్పడమే కాకుండా అపోహలను తొలగించాలని అస్సాం ప్రభుత్వం భావించింది. హిందూ సాంప్రదాయ ఆచారంలో దహన సంస్కారాలను నిర్వహించి.. దాదాపు 2500 కొమ్ములను దహనం చేశారు.

    Trending Stories

    Related Stories