ఓ వైపు కరోనా కేసులతో సతమతమవుతున్న ఆ రాష్ట్రం.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ కేసులతో టెన్షన్ పడుతోంది. ఇటీవలి కాలంలో కేరళలోని చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతూ ఉండగా.. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తూ ఉన్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నిర్ధారించబడ్డాయి. వేచూర్, ఐమనం, కల్లార పంచాయతీల నుండి సేకరించిన నమూనాలు పాజిటివ్ గా పరీక్షించబడ్డాయి. దీంతో వైరస్‌ను కలిగి ఉన్న బాతులు, ఇతర పక్షులను బుధవారం నుండి చంపేయనున్నారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ పికె జయశ్రీ అధికారుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత వారం అలప్పుజా జిల్లాలో ఇదే ఫ్లూ నిర్ధారణ అయింది. వైరస్ బారిన పడిన బాతులు, ఇతర పక్షులను చంపారు.
అలప్పుజాలో బర్డ్ ఫ్లూ భారీ నష్టాలకు దారితీసింది. అలప్పుజాలో బాతులను చంపి కాల్చివేశారు. కొట్టాయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోనున్నారు. కేసులు నిర్ధారించబడిన ప్రాంతాల్లో అధిక ప్రమాదం ఉన్న పక్షులను నాశనం చేయడానికి బృందాలను అధికారులు మోహరించనున్నారు. అలప్పుజాలో కొన్ని వారాల క్రితం బాతులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది.ఒక పంచాయతీలో ముగ్గురు రైతులకు చెందిన 8,000 బాతులు చనిపోయాయి. కొట్టాయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని పౌర, జిల్లా యంత్రాంగం భావిస్తోంది. మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
కొట్టాయంలోని వేచూర్ పంచాయతీలో, కట్టమడ, వలియపుతుక్కరి-పుల్లూజిచల్ ప్రాంతంలో వైరస్ కనుగొనబడింది. కల్లార పంచాయతీలోని వెంతకరి-కిజక్కెచిర ప్రాంతం, ఐమనంలోని కలుంగుతర-ఐక్కరశాల ప్రాంతం ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మాస్ కల్లింగ్ నిర్వహించడానికి పది మందితో కూడిన బృందాన్ని నియమించారు. ఒక్కో బృందంలో వెటర్నరీ డాక్టర్, ఒక లైవ్‌స్టాక్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు సహాయకులు ఉంటారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత అనుసరించాల్సిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 28,500 నుండి 35,000 పక్షులను చంపాల్సి ఉంటుంది. 60 రోజుల కంటే తక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.100, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.200 పరిహారం అందజేస్తారు. బర్డ్ ఫ్లూ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.