పసగలవారిని ఎదుర్కొనే సత్తాలేని వారు.. పసివాళ్ల మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు అంటారు పెద్దలు. ఈ తరహా తంతు ఇటీవల నేరాల, ఘోరాల భూమిగా పేరొందిన కేరళలో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల పసిబాలుడు.. పొరబాటుగా బడాబాబు కారుపై తూలడంతో.. ఆ కారు ఓనర్ ఆ చిన్నారిని విచక్షణారహితంగా కొట్టాడు. ఆ రాక్షస మనస్కుడు ఎంత దారుణంగా కొట్టాడంటే.. ఆ పసి పిల్లాడి వెన్నెముకకు బలమైన గాయం తగిలి, ఆసుపత్రి పాలయ్యాడు.
కేరళ కన్నూర్ జిల్లా తలస్సేరిలో సిహ్షాద్ మహమ్మద్ అనే వ్యక్తి ఓ చోట కారు పార్క్ చేశాడు. ఆ సమయంలో రాజస్థాన్‌కు చెందిన వలస కూలీ ఆరేళ్ల కుమారుడు గణేష్.. అటువైపుగా వచ్చి పొరపాటుగా కారును ఆనుకుని నిలబడ్డాడు. అంతే.. సిహ్షాద్ మహమ్మద్‌లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. సిగ్గు, శరం వదిలేసి, పళ్లు పటపట లాడించి, కళ్లు చింత నిప్పుల్లా మార్చేసుకుని.. పసి పిల్లాడిని గొడ్డును బాదినట్టు బాదేశాడు. బాలుడిని విచక్షణారహితంగా కొడుతుండటం చూసి.. స్థానికులు నివ్వెరబోయారు. పిల్లాడిని కాపాడదామని స్థానికులు అనుకున్నా.. రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న అతడి తీరుచూసి.. ఆ మూర్ఖుడి జోలికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. కొంతమంది కాస్త ధైర్యం చేసి.. ఇదేమని ప్రశ్నిస్తే.. వారిపై తిట్ల దండకం అందుకున్నాడు. అడిగినవారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీవ్రగాయాలపాలైన పసివాడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు బాలుడి వెన్నెముకకు బలమైన గాయం అయ్యిందని చెప్పారు. నిందితుడిని పొన్నంబాలానికి చెందిన సిహ్షాద్ మహ్మద్‌గా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజీలో, దుండగుడు కారుపై ఆనుకుని ఉన్న బాలుడిని ముహమ్మద్ కొట్టడం స్పష్టంగా కనిపించింది. నిందితుడితో పాటు పర్దాలో వున్న మహిళ మాత్రం ఈ ఘాతుకంపై మౌనంగా రోదించిందని, పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని స్థానికులు చెప్పారు. అనంతరం, వారిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారని అన్నారు.
ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు పరిశీలించారు. అనంతరం, నిందితుడు సిన్షాద్ ముహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరస్థుడిపై దాడి, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశామని, కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.