More

    98 లక్షలతో ముఖ్యమంత్రి ఇంటికి రిపేర్లు.. టెండర్లు పిలవకుండానే..!

    కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇంటిని బాగుచేయడానికి ఏకంగా 98 లక్షల రూపాయలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేవలం రిపేరీలకే ఇంత డబ్బు ఖర్చు పెడుతుండడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసమైన ‘క్లిఫ్ హౌస్’ లో మార్పులు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు పెట్టబోతోంది. ఇందు కోసం ఎలాంటి టెండర్లను కూడా పిలవలేదు. ఉరలుంగల్ సొసైటీకి ఈ రెనోవేషన్ ప్రాజెక్టును అప్పజెప్పారు. ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండానే వారు చెప్పినంత ఇచ్చేస్తోంది కేరళ ప్రభుత్వం. ఈ రెనోవేషన్ లో భాగంగా.. డ్రైవర్లకు చెందిన రెస్ట్ రూమ్స్, గన్ మెన్, సెక్యూరిటీ గార్డులు, అటెండర్లకు చెందిన గదులలో కూడా మార్పులు చేయనున్నారు.

    టెండర్లకు ఆహ్వానించకుండానే పనుల అప్పగింత:
    సాధారణంగా ఇలాంటి పనులకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పి.డబ్ల్యూ.డి.) టెండర్లను ఆహ్వానిస్తుంది. కానీ పినరయి విజయన్ ఇంటి విషయంలో ఇలాంటివి జరగలేదు. సాధారణంగా ప్రభుత్వం మారి.. కొత్త ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రులు అధికారంలోకి వస్తే.. వాళ్లకు తగ్గట్టుగా ఇళ్లల్లో మార్పులు చేస్తూ ఉంటారు. కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వమే అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ భారీ మొత్తంలో ప్రజల సొమ్మును ఇలా ఇంటి కోసం వాడుతూ ఉండడం వివాదాస్పదమవుతోంది. అది కూడా పి.డబ్ల్యూ.డి. విభాగం ఇందుకోసం టెండర్లను పిలిపించకుండా పనులకు పూనుకోవడం విమర్శలకు తావిస్తోంది.

    గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును మంత్రుల ఇళ్లను బాగు చేయడానికి వాడారు. 2018లో ఆర్.టి.ఐ. ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం.. 82.35 లక్షలను మంత్రుల ఇళ్ల బాగుకోసం ఉపయోగించారు. స్పోర్ట్స్ మినిస్టర్ ఈ.పి. జయనన్ ఉన్న జండూ బంగ్లా కోసం 13 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి ఇంటి కోసం ఇంతకు ముందు 9,56,871 రూపాయలను వినియోగించారు.

    ఊమెన్ చాందీ ప్రభుత్వం ఏకంగా 4.3 కోట్ల రూపాయలను ఇళ్ల మరమ్మతుల కోసం ఉపయోగించారు. అది కూడా వివాదాస్పదమైంది. వి.ఎస్.అచ్యుతానందన్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఎంతో సొమ్మును ఇళ్ల మరమ్మతుల కోసం ఉపయోగించారని తెలిపారు. అందులో చాలా వరకూ లెక్కలు చూపించలేదని విమర్శలు వచ్చాయి. అప్పటి మంత్రులు సి.దివాకరన్, కొడియేరి బాలకృష్ణన్ ఇంటి మరమ్మతుల కోసం 17 లక్షలు, 11 లక్షలు ఖర్చు చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో మరమ్మతుల పనిని ఆపేశారు. ఇప్పుడు కూడా పినరయి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును మరమ్మతుల కోసం వినియోగిస్తూ ఉండడం వివాదానికి దారి తీస్తోంది.

    Trending Stories

    Related Stories