More

  ‘హిజాబ్ ను హక్కు’గా అంగీకరిస్తే ముస్లిం మహిళలే నష్టపోతారు: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

  హిజాబ్ కు అనుకూలంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ స్పందించారు. ‘హిజాబ్ ను హక్కు’గా అంగీకరిస్తే ముస్లిం మహిళలు నష్టపోయే అవకాశం ఉందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పుకొచ్చారు. కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదాన్ని విమర్శిస్తూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మాట్లాడారు. ‘హిజాబ్ ధరించే హక్కు’ వాదన ఆమోదయోగ్యమైనదని ఒప్పుకుంటే అప్పుడు నష్టపోయేది ముస్లిం మహిళలేనని అన్నారు. ఇస్లాం చరిత్రలో స్త్రీలు ముసుగు ధరించడానికి నిరాకరించిన అనేక సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

  కర్ణాటకలో హిజాబ్ వివాదంపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఆయన ఒక చిన్న కథను వినిపించారు. “ఒక చిన్న అమ్మాయి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంట్లోనే పెరిగారు. ఆమె ప్రవక్త భార్య మేనకోడలు. ఆమె అందంగా ఉంది. మధ్యయుగ కాలంలో, ఆమె హిజాబ్ ధరించనందుకు దూషించబడింది. దేవుడు తనని అందంగా తీర్చిదిద్దాడని, సర్వశక్తిమంతుడు తన అందాల ముద్రను ఆమెపై ఉంచాడని ఆమె చెప్పింది. ప్రజలు నా అందాన్ని చూడాలని, నా అందంలో భగవంతుని దయ ఉంటుందని ఆమె చెప్పింది. ఇస్లాం మొదటి తరం స్త్రీలు ఇలాగే ప్రవర్తించారు”, ఈ కథ నిజమని, ఇస్లాం చరిత్రలో లిఖించబడిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ”గతంలో ఆక్రమణదారుల కారణంగా ఉత్తర భారతదేశంలో పరదా కనిపించింది. కానీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని స్త్రీలు చాలా పొడవాటి ముసుగులు ధరించరు. అలా చేయవలసిన అవసరం లేదు. కాలం మారుతున్న కొద్దీ ఆచారవ్యవహారాలు కూడా మారతాయి” అని ఆయన అన్నారు. హిజాబ్ వివాదం ఘటనలు పనికిరానివని ఆయన ఘాటుగా చెప్పుకొచ్చారు. “యూనిఫారమ్‌తో సమస్య ఉందని చెబుతున్న అమ్మాయిలు కొన్ని సూత్రాలు, ప్రమాణాలతో ఏదైనా పాఠశాలలో చేరినప్పుడు, వారు ఆ సంస్థ నియమాలను పాటించవలసి ఉంటుందని అర్థం చేసుకోవాలి ”అని ఆయన చెప్పారు.

  కేరళ గవర్నర్ ఇండియా టుడేతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు, భారతదేశ విషయాలలో జోక్యం చేసుకుంటున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. “పాకిస్తాన్ ప్రభుత్వం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. హిజాబ్‌కు మద్దతిచ్చిన మలాలాకు ఈ సమస్య గురించి తప్పుడు సమాచారం అందించి ఉండవచ్చు. హిజాబ్ హక్కును అంగీకరిస్తే, ముస్లిం మహిళలు ఓడిపోతారని, వారి జీవితాలు దయనీయంగా మారుతాయని ఆమె అర్థం చేసుకోవడంలో విఫలమైంది” అని ఆయన అన్నారు.

  హిజాబ్ విద్యార్థినులు బయటి శక్తుల ప్రేరేపణలకు గురికాకుండా ఉండాలని, విద్యపై దృష్టి సారించాలని, మెరుగైన జీవన ప్రమాణాలపై దృష్టి సారించాలని కోరారు. హిజాబ్ ధరించిన ఎనిమిది మంది ముస్లిం బాలికలు పాఠశాల యూనిఫాం నిబంధనలను అనుసరించడానికి నిరాకరించడంతో ఈ నెల ప్రారంభంలో హిజాబ్ వివాదం చోటు చేసుకుంది. హిజాబ్‌తో తరగతులకు హాజరుకావడం తమ ప్రాథమిక హక్కు అని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు ప్రకటించింది. బాలికలు సుప్రీం కోర్టు తలుపులు తట్టడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

  Trending Stories

  Related Stories