More

    కేరళ పోలీసుల అత్యుత్సాహం.. చెక్ పెట్టిన శబరిమల భక్తులు..

    సుదీర్ఘ మండల మకరవిలక్కు పూజల కోసం కేరళలోని పవిత్ర శబరిమలై అయ్యప్పస్వామి ఆలయం తెరుచుకుంది. సాధారణంగా ప్రతి ఏటా నవంబరు 16 నుంచి జనవరి 20 వరకు ప్రత్యేక పూజలు జరుగుతూవుంటాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తుంటారు. ఇప్పుడు ఆలయం తెరుచుకుని, రెండు నెలలపాటు సాగే మండల – మకరవిలక్కు పూజల కోసం భక్తులను అనుమతించడంతో భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు మార్గదర్శకాలపై తీవ్ర దుమారం రేగింది. అయితే, భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేరళ సర్కారు వెనక్కి తగ్గింది.

    నాలుగేళ్ల కిందట అయ్యప్పస్వామి సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు వెలువరించింది. అనంతరం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో వివాదం చెలరేగింది. తాజాగా.. సన్నిధానం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కోసం కేరళ ప్రభుత్వం హ్యాండ్ బుక్ ప్రచురించింది. ఆలయంలోకి భక్తులను అనుమతించే విషయంలో భద్రతా సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను తెలియజేయడం కోసం కేరళ హోంశాఖ ఈ పుస్తకాన్ని ముద్రించింది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ హ్యాండ్‌బుక్‌ను ఉపసంహరించుకుంది.

    ‘సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం భక్తులందరికీ అయ్యప్ప ఆలయంలో ప్రవేశార్హత ఉంటుంద’ని ఓ నిబంధనగా పేర్కొంది. అన్ని వయసుల మహిళలకు అనుమతి విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా.. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ప్రవేశం సూచనను చేసిందని పలువురు విపక్ష నేతలు ధ్వజమెత్తారు. దీనిపై వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ స్పందించారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశంలేదని, పాత పుస్తకాన్ని యథాతథంగా తిరిగి ముద్రించడం వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. అనుమానాలకు తావిచ్చేలా ఉన్న ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు.

    హ్యండ్ బుక్ లో చోటుచేసుకున్న లోపాలను సవరిస్తామని, కొత్త హ్యాండ్‌ బుక్‌ను ముద్రించి పోలీసులకు అందజేస్తామని కేరళ అదనపు డీజీపీ ఎం.ఆర్‌. అజిత్‌ కుమార్‌ తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రంతో ప్రశాంతతకు విఘాతం కల్గించాలని, శబరిమలను తిరిగి యుద్ధభూమిగా మార్చాలని ప్రయత్నిస్తే.. భక్తులను లక్ష్యం చేసుకోవాలని భావిస్తే ఊరుకునేది లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ తెలిపారు. పాత విషయాలన్ని తమకు గుర్తు లేవనుకుంటే పొరపాటేనని, తిరిగి అలాంటి ఎత్తుగడలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన చెప్పారు. వరుణుడి దీవెనలతో ఆలయ దర్శనం ప్రారంభమైంది. భారీ వర్షంలో భక్తులు తడుస్తూ ఆలయ దర్శనం చేసుకున్నారు.

    Trending Stories

    Related Stories