More

  ఎయిర్‎పోర్ట్, రన్‎వే అన్నీ క్లోజ్..! అనంత పద్మనాభుడి ఆజ్ఞ మరి..!!

  దేవుడి ఊరేగింపు కోసం ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం మనకు తెలుసు. ముఖ్యంగా వినాయక నిమజ్జనోత్సవం రోజున హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం మనం చూశాం. ఆ రోజు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటిస్తుంది. కానీ, దేవుడి ఊరేగింపు కోసం విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడం ఎక్కడైనా చూశారా..? ఏకంగా ఎయర్ పోర్టును మూసివేయడం ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా..? అయితే, మనం కేరళ రాజధాని తిరువనంతపురం వెళ్లాల్సిందే.

  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల భువన సంరక్షకుడు శ్రీమన్నారాయణుడు.. అనంత పద్మనాభుడి రూపంలో కొలువైన దివ్యక్షేత్రం తిరువనంతపురంలో ఉంది. అదేనండీ, కొన్నేళ్ల క్రితం వేల కోట్ల సంపద వెలుగుచూసింది కదా..! అదే ఆలయం. దేశంలో అతిపెద్ద ఆలయాల్లో అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా ఒకటి. ట్రావెన్‎కోర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి నిర్వహణలో ఈ పవిత్ర ఆలయం భక్తజన వరదతో, నిత్యశోభితంగా విరాజిల్లుతోంది. అనంతశేషుడి తల్పం మీద యోగనిద్రలో దర్శనమిచ్చే అనంతపద్మనాభస్వామివారి ఈ దేవాలయం, యావత్ విశ్వంలోనే అత్యంత ప్రసిద్ధ ఆలయం. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగానూ పేరుపొందింది.

  వడ్డికాసులవాడి నిలయంగా, కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయం సైతం ఆదాయ సముపార్జనలో, స్థిర చర ఆస్తులు కలిగియుండడంతో.. తిరువనంతపురం అనంత పద్మనాభి ఆలయం తర్వాత స్థానంలో వుండడం విశేషం. ఇంతటి విశిష్ట అనంత పద్మనాభస్వామి ఆలయంలో.. పూజాదికాలైనా, పుణ్యక్రతువులైనా.. ఏవైనా అనంత రీతిలోనే జరుగుతాయనడంలో విశేషం ఏముంది..? ఎంతో పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలకు కొదువలేదు. అలాంటి ఉత్సవాల్లో ‘ఆరట్టు’ కూడా ఒకటి. ఈ చారిత్రక ఆలయంలో ప్రతి రెండేళ్లకోసారి ఎంతో భక్తిప్రదంగా సాగే ‘ఆరట్టు’ఊరేగింపు సందర్భంగా.. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారు. ఈసారి కూడా అయిదు గంటలపాటు అన్ని విమానాల రాకపోకలను స్తంభింప చేశారు.

  ముందుకు తప్ప వెనుకడుగు వుండని దివ్యరథ చక్రాలను కలిగివున్న స్వామి పూరి జగన్నాథ స్వామి.. జగన్నాథుడు శ్రీమన్నారాయణుని అవతారమే. జగన్నాథ రథయాత్ర సాగే విధంగానే.. కేరళ అనంత పద్మనాభ స్వామి వారి ఆరట్టు ఊరేగింపునకు సైతం ఆగడం అనేది వుండదు. అందుకే, స్వామివారి ఊరేగింపు సాఫీగా సాగేందుకు వీలుగా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ అథారిటీ.. అయిదు గంటలపాటు విమానాలకు విరామం ప్రకటించింది. ఉత్సవ ఊరేగింపు విమానాశ్రయ రన్‎వే మీదుగా సాగాల్సి వున్నందున నవంబర్ 1 న, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రన్ వేని విమానాశ్రయ అధికారులు మూసివేశారు. ఈ కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేశారు. స్వామివారి ఆచారబద్దమైన ఊరేగింపు కోసం ఈ రీ షెడ్యూల్ చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

  విమానాశ్రయం రన్‌వే వద్ద ఆరట్టు మండపం ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. ఈ ఊరేగింపు సమయంలో ఆలయ ఉత్సవ విగ్రహాలను అక్కడ కొంతసేపు ఉంచుతారు. కాబట్టి, ఆలయ వారసత్వ సంప్రదాయానికి భంగం వాటిల్లకుండా.. పవిత్ర ఊరేగింపునకు ఆటంకం కల్గకుండా.. ఆలయ కమిటీకి.. విమానయాన సంస్థలు అన్నిరకాల సహాయ సహకారాలను అందజేస్తాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా స్వామివారి ఊరేగింపు కోసం విమనాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసి సంప్రదాయ వేడుకకు సహకరించారు.

  అనంతపద్మనాభస్వామి వారి ఆలయ ఉత్సవ ఊరేగింపు సజావుగా సాగేందుకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలను నిలిపివేసే ప్రక్రియ దశాబ్దాల క్రితమే మొదలైంది. 1932లో విమానాశ్రయం స్థాపించక పూర్వం నుంచే ఈ ఆచారం కొనసాగుతోంది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది ఎయిర్‌పోర్టు నిర్వహణను అదానీ గ్రూప్‌ చేపట్టింది. ఆచారబద్ధంగా ఊరేగింపు కొనసాగడం కోసం, ఎయిర్ పోర్ట్ మూసివేసే పద్ధతిని అదానీ గ్రూప్ కొనసాగించింది.

  శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో జరిగే ఆరట్టు ఉత్సవాన్ని అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఇక తిరువనంతపురం ప్రజలకు ఈ వేడుక మహా తిరునాళ్ల సంబరం కిందే లెక్క. ఆరట్టు, పవిత్ర సముద్ర స్నానం కోసం ఆలయం నుంచి శంఖుముఖం బీచ్ వరకు ఈ ఊరేగింపు జరుగుతుంది. సంప్రదాయ పద్ధతులు అనుసరించి, ఆలయ ఉత్సవ మూర్తులకు ఏడాదికి రెండుసార్లు పవిత్ర స్నానం చేయించడానికి సాగర తీరానికి తీసుకు వెళతారు. ఈ సముద్ర తీరం.. విమానాశ్రయం వెనుక ఉంది. అక్టోబరు-నవంబర్‌లలో జరిగే ద్వై-వార్షిక అల్పాసి ఉత్సవం, మార్చి-ఏప్రిల్‌లో జరిగే పంగుని పండుగ కోసం రన్‌వే మూసివేయడానికి ముందు విమానాశ్రయం సంవత్సరానికి రెండుసార్లు NOTAM, నోటీస్ టు ఎయిర్‌మెన్ విడుదల చేస్తుంది. శంఖుముఖం బీచ్ లో సాగర పుణ్యస్నానం అనంతరం.. ఈ వేడుక ముగింపును సూచించే విధంగా సంప్రదాయ జ్యోతులను వెలిగిస్తారు. అనంతరం ఊరేగించిన విగ్రహాలను తిరిగి దైవ మందిరంలోకి తీసుకువెళతారు. ఆచార వ్యవహారాలను అనుసరించి ఆలయ మైదానంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సైతం ఆనవాయితీగా వస్తోంది.

  Trending Stories

  Related Stories