‘రామా’ అంటే చంపేస్తారట..?! ‘విశ్వాసం’ లేని ‘ఆప్’ నీతి..!

0
648

ఢిల్లీలోని ప్రముఖ రచయిత, మాజీ ఆమాద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ కు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. కుమార్ విశ్వాస్ రాముడిని ఎక్కువగా పొగుడుతున్నాడనీ,.. ఇది మరోసారి పునరావృతమైతే చంపేస్తానంటూ ఓ ఆగంతకుడు మెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. పనిలో పనిగా తమ నాయకుడు కేజ్రీవాల్ ను విమర్శించడం కూడా మానుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు. గత నెల అక్టోబర్ 23న మొదటి ఈమెయిల్ రాగా,.. తర్వాత వరుసగా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో భయాందోళనకు గురైన రచయిత కుమార్ విశ్వాస్ ఇందిరాపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులతో అలర్టయిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని లోకేష్ శుక్లాగా గుర్తించారు. నిందితుడు ఇండోర్ లోని సుధామ నగర్ లో నివసిస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

గతంలో రచయిత కుమార్ విశ్వాస్ ఆమాద్మీ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా చాలాకాలం పనిచేశారు. ఆప్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ఎదుగుదలలో ఆయన ఎంతగానో సహాయపడ్డారు. అయితే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయిన తర్వాత తనకు సహాయం చేసిన వారందరినీ మెల్లమెల్లగా పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. ఆమాద్మీలో తన ఏకఛత్రాధిపత్యమే నడవాలనే ఉద్దేశంతో కుమార్ విశ్వాస్ ను కూడా పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో పాటు కేజ్రీవాల్ కు ఖలిస్తానీ ఉద్యమకారుల పట్ల సానుభూతి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన కుమార్ విశ్వాస్ పంజాబ్ ఎన్నికల ముందు పార్టీని వీడారు. ఇక అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తరచూ కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ వచ్చారు. కుమార్ విశ్వాస్ స్వయంగా రామ భక్తుడు. చాలా సభల్లో రాముడి ప్రబోధనలు చేసిన వ్యక్తి. దీంతో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన లోకేష్ శుక్లా కుమార్ విశ్వాస్ కు బెదిరింపు మెయిల్స్ ను పంపడం మొదలుపెట్టాడు.

ఇక ఈ కేసులో నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ 507, 295ఏ, తో పాటు సైబర్ నేరాలకు పాల్పడినందుకు గానూ ఐటీ చట్టంలోని 66ఎఫ్ కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక నిందితుడిని అతడి కంప్యూటర్ ఐపీ అడ్రెస్ ద్వారా గుర్తించి అరెస్టు చేసినట్లు ఇందిరాపురం పోలీస్ స్టేషన్ ఇంఛార్జి దేవ్ పాల్ సింగ్ తెలిపారు.

అయితే నిందితుడు కుమార్ విశ్వాస్ ను బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఆమాద్మీ పార్టీ ప్రమేయమేదైనా ఉందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఆమాద్మీ పార్టీ తీవ్ర అవనీతి ఆరోపణలతో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోందనీ,.. దీంతో కేజ్రీవాల్ లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందనీ పలువురు భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారనీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిందితుడితో కేజ్రీవాల్ పార్టీకి సంబంధాలున్నందుకే ఇప్టటివరకూ ఈ బెదిరింపులను ఆమాద్మీ పార్టీ ఖండించే ప్రయత్నం కూడా చేయడంలేదనీ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బెదిరింపుల్లో నిందితుడికి ఎవరైనా సహకరించారో లేదో అనే విషయంపై కూడా దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × three =