కరెన్సీపై దేవుళ్ళ ఫొటోలెందుకు లేవు..? కేజ్రీవాల్ ఎన్నికల స్టంట్ మామూలుగా లేదు..!

0
711

అదేంటో గానీ, ఎప్పుడూ కుహనా లౌకివాదం ప్రదర్శించే కొందరు రాజకీయ నాయకుల్లో ఒక్కోసారి హిందుత్వం తన్నుకుంటూ వచ్చేస్తుంది. తమకు మించిన హిందువు మరొకరు లేరనే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్లుండి దేవాలయాలకు తిరగటం మొదలెడతారు. అప్పటివరకు పంచె కట్టనివారు కూడా జారిపోతున్నా సర్దుకుంటూ మరీ ప్రదక్షిణలు చేయడానికి పోటీపడతారు. మరికొంతమందయితే ఏకంగా కైలాసనాథుడి నుంచే తనకు పిలుపొచ్చిందని ఎన్నికలప్పుడే కైలాసయాత్రకు బయలుదేరతారు. అయితే ఉన్నట్లుండి ఈ విధంగా హిందుత్వం బయటపడటం వెనుకే ఒక పెద్ద కిటుకు దాగి ఉంది. అదే ఎన్నికలు.

తాజాగా కేజ్రీవాల్ లో కూడా ఈ హిందుత్వ భావజాలం వెల్లువలా తన్నుకొచ్చింది. గతంలో హిందువులను అనేకమార్లు అపహాస్యం చేసిన కేజ్రీవాల్ కు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. కరెన్సీ నోట్లపై హిందూ దేవీ దేవతల ఫోటోలు ఎందుకు లేవని కేజ్రీవాల్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇండోనేషియాలో 98 శాతం ముస్లిం జనాభా ఉన్నా కూడా ఆ దేశపు కరెన్సీ పై హిందూ దేవీ దేవతల ఫోటోలున్నాయని చెప్పుకొచ్చారు. అయితే భారత్ లో హిందూ మెజారిటీ ఉన్నా కూడా ఇక్కడ నోట్లపై దేవతల ఫోటోలు ఎందుకు లేవని ప్రశ్నించారు కేజ్రీవాల్. భారత కరెన్సీపై ఇప్పుడున్న గాంధీ ఫోటోకు వెనకభాగంలో లక్ష్మీ దేవి తో పాటు, గణేషుడి ఫోటో ను కూడా ముద్రించాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధంగా ఫోటోలను ప్రచురించడం దేశానికి కూడా ఎంతో శ్రేయస్కరం అని అన్నారు. మరో రెండురోజుల్లో ఈ అంశంపై కేంద్రానికి లేఖ కూడా రాస్తానని వెల్లడించారు. అయితే కేజ్రీవాల్ కు ఉన్నట్టుండి హిందుత్వంపై ప్రేమ పుట్టుకురావడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. కేజ్రీవాల్ ఇన్నాళ్ళూ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరించి ఇప్పుడు గుజరాత్ ఎన్నికల కోసమే ఈ ప్రతిపాదనను బీజేపీ దుయ్యబట్టింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర కేజ్రీవాల్ గత చరిత్రను తవ్వితీస్తూ మాటల యుద్దానికి దిగారు. నిజంగా హిందువులపై అంత ప్రేమే ఉంటే ఢిల్లీలో దీపావళి బాణాసంచాను ఎందుకు నిషేధించారని సంబిత్ పాత్ర విమర్శించారు. గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోద పన్నును రద్దు చేయమన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కశ్మీరీ పండిట్లను అపహాస్యం చేసిన కేజ్రీవాల్ కు ఉన్నట్టుండి హిందుత్వం గుర్తొచ్చిందా అని సంబిత్ పాత్రా దుయ్యబట్టారు. ఇక కేజ్రీవాల్ ఎన్నికలప్పుడు హిందువులకు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల తర్వాత మరచిపోతాడని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికలయ్యాక అసలైన హిందూ ద్వేషం బయటకొస్తుందని అంటున్నారు. గతంలో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కూడా కేజ్రీవాల్ వ్యతిరేకించాడని పలువురు గుర్తు చేస్తున్నారు. అయోధ్యలోని మందిరంలో పూజలందుకోవడానికి రాముడు కూడా ఇష్టపడడని కేజ్రీవాల్ చెప్పిన వీడియోలను నెటిజన్లు వెలికి తీస్తున్నారు. ఇంతటి హిందూ ద్వేషం తనలో పెట్టుకుని ఇప్పుడు కేవలం గుజరాత్ ఎన్నికలు సమీపిస్తుండటంతో హిందూ ప్రేమను ఒలకబోస్తున్నాడని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

అయితే కేజ్రీవాల్ కు నిజంగా కరెన్సీ నోట్లపై హిందూ దేవీ దేవతల ముద్రణకు అంతగా చిత్తశుద్ది ఉంటే,.. దానికోసం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సాధారణ లేఖలు అంతగా ప్రభావం చూపలేవు. కానీ, అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపితే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ తీర్మానాలకు కూడా కాస్త ప్రభావం ఉండటం వల్ల హిందుత్వవాదులు కూడా కేజ్రీవాల్ కు మద్దతుపలికే అవకాశం ఉంటుంది. కేజ్రీవాల్ చేసిన తీర్మానాలకు కూడా బీజేపీ ప్రభుత్వం స్పందించకపోతే కాషాయ పార్టీకి హార్డ్ కోర్ ఓటర్లయిన కాషాయవాదుల్లో కూడా కేజ్రీవాల్ పై సానుభూతి వచ్చే అవకాశమూ లేకపోలేదు. కానీ ఈ విధంగా కేవలం ప్రెస్ మీట్లకు, లేఖలకు పరిమితమవడం వల్ల ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కుగానే ప్రజలు భావించే ప్రమాదమూ ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

ten − ten =