చైనా బయటకు భారత్ తో సత్సంబంధాలు ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. కానీ భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే కుతంత్రాలను మాత్రం ఆపదు. ఎప్పటికప్పుడు భారత్ తో చావు దెబ్బ తింటూనే ఉంది చైనా..! మరో వైపు ఇటీవలి కాలంలో చైనా ఆర్మీ సరిహద్దులో సైనిక చర్యలను ఎక్కువ చేసింది. దీనిపై భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణే స్పందించారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని అన్నారు.
చైనా దూకుడుగా ప్రవర్తిస్తే తాము కూడా అందుకు గట్టి జవాబు ఇవ్వగలమని.. దూకుడుగా ప్రవర్తించినంత మాత్రాన అనుకున్నవి జరిగిపోవని చైనాకు గతంలోనే భారత్ స్పష్టం చేసిందని నరవాణే అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారంతోనే వాస్తవాధీన రేఖ నుండి వెనక్కు వెళ్లాయని.. ఈ అంగీకారానికి తూట్లు పొడిచే చర్యలకు పాల్పడితే మాత్రం భారత్ ధీటుగా బదులిస్తుందని అన్నారు. పాంగ్యాంగ్ సరస్సు వద్ద చైనా చర్యలను భారత సైన్యం ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉందని అన్నారు. చైనా 50000 నుండి 60000 మంది సైన్యాన్ని అక్కడ ఉంచగా.. భారత్ కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరింపజేసిందని నరవాణే తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అంత గొప్పగా లేకపోయినా చర్చల ద్వారా ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలమని అన్నారు.
భారత్ చైనా దేశాల మధ్య 12 రౌండ్ల కమాండర్-లెవెల్ స్థాయిలో చర్చలు జరిగాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించేలా ఇరు దేశాలు ఒకానొక దశలో చర్చలు నిర్వహించాయి. ఇటీవలే నరవాణే చైనా సరిహద్దుల్లోనూ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోనూ భారత సైన్యం మోహరింపుపై సమీక్షను నిర్వహించారు. నాగాలాండ్ దగ్గర ఉన్న దిమాపూర్ వద్దకు రెండు రోజుల పర్యటనలో భాగంగా మే 20న వెళ్ళారు. భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో గత ఏడాది నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా కుదిరిన అంగీకారంతో వెనక్కు వెళ్లగా.. చైనా మరోసారి తన బుద్ధి చూపించింది.
భారత వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా కూడా ఇటీవల లదాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని సందర్శించారు.తూర్పు లదాఖ్ సమీపంలోని తమ శిక్షణా ప్రాంతాంలో చైనా బలగాలు శిక్షణ నిర్వహిస్తున్న సమయంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా సరిహద్దులో కొనసాగుతున్న కార్యకలాపాలపై భదౌరియాకు లేహ్ వైమానిక స్థావర అధికారులు వివరించారు. లేహ్ ప్రాంతంలో పారామిలిటరీ దళాలకు మద్దతుగా వాయు నిర్వహణ కార్యకలాపాల గురించి భదౌరియాకు తెలిపాయి.