More

    కేసీఆర్ వ్యూహమేంటి..? ‘మహాధర్నా’ వెనుక మర్మమేంటి..?

    తెలంగాణ ఉద్యమ కాలం నాటి స్వరధాటి మరో సారి కేసీఆర్ కంఠంలో ప్రతిధ్వనించింది. కణికుడి ‘కూటనీతి’ ప్రస్తావన మొదలు, యుద్ధం, ఉద్యమం, పోరాటం, రణం లాంటి బరువైన మాటలు ముఖ్యమంత్రిగారి ఆగ్రహ ఉద్ఘాటనలో వినిపించాయి. ఏడేళ్ల కాలంగా ప్రత్యర్థి ఉనికిని గుర్తించ నిరాకరించిన కేసీఆర్ ఒక్కసారిగా బాక్సింగ్ రింగ్ లోకి ఆగంతుకంగా దూకారు.

    కార్చిచ్చును అదుపు చేసేందుకు ఎదురగ్గి పెట్టక తప్పదని ఎట్టకేలకు గ్రహించారు. ఆలసమ్యే అయినా శతృవు స్థితిని గణించారు. చాపకింది నీరులా విస్తరిస్తున్న ప్రమాదాన్ని గుర్తించారు. ఇంతకాలం చెల్లిన నాణెం రాత్రికిరాత్రి రద్దయిపోయిన విస్తుపోయే సన్నివేశం కేసీఆర్ లో పట్టరాని ఆగ్రహానికి కారణమైంది.  

    కేసీఆర్ ఆగ్రహానికి కారణం కేవలం వడ్లగింజలేనా? ‘మహాధర్నా’ వెనుక మతలబు ఏంటి? రైతులా? రాజుకుంటున్న రాజకీయ వేడిని నియంత్రించే ప్రయత్నమా? బీజేపీ తన ప్రత్యర్థిగా ప్రకటించడం దేన్ని సూచిస్తుంది? ‘హుజురాబాద్ ఉప ఎన్నిక’ తర్వాత రాజకీయాల్లో ఊహించని మార్పు వస్తుందని రాజనీతిజ్ఞులు వేసిన ‘అంజనం’ నిజమని తాజా పరిణామాలు సూచిస్తున్నాయా? తన పీఠాన్ని కదిల్చే వ్యూహమేదో ‘హస్తిన’లో పురుడు పోసుకుంటోందని కేసీఆర్ గ్రహించారా? ఒక వేళ అదే నిజమైతే…విరుగుడుగా కేసీఆర్ రచించే ప్రతి వ్యూహమేంటి? ‘నేనే దిగుతా రంగంలోకి దిగుతా’ అని కేసీఆర్ ప్రకటించడం మరొక సమర్థవంతమైన నేత తమ పార్టీలో లేడని చెపుతున్నట్టే కదా!

    శరపరంపరగా దూసుకువస్తున్న ఈ ప్రశ్నలే తెలంగాణ రాజకీయ రణరంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నిరసన గళం చెవిన పడకూడదని స్వయంగా తానే నిషేధించిన ‘ధర్నాచౌక్’లో సీఎం కేసీఆర్ అదే నిరసన స్వరాన్ని వినిపించడం వర్తమాన వైచిత్రి. మూడు ప్రెస్ మీట్లు, ఒక ‘మహాధర్నా’ వెరసి ఒక ‘political rumbling’. ఈ ‘రాజకీయ గర్జన’ వెనుక కనిపించని Dynamics  ఉన్నాయి. తెలంగాణ రాజకీయ చలన సూత్రాల్లో సరికొత్త కుదుపు మొదలైంది. అందుకు కారణం ‘హుజురాబాద్ బైపోల్’. హుజురాబాద్ ఉపపోరులో కమలం గెలిచిందా? ఈటల గెలిచాడా? అన్న ప్రశ్న వేయడం రాజకీయ అవివేకం.

    ఒక వేళ ఈటల గెలిచాడే అనుకుందాం…అయితే ఆయన నమ్ముకున్న ఛత్రఛాయ సదరు విజయాన్ని ఎలా వలయాలు వలయాలుగా విస్తరిస్తుందో విస్మరించడం అజ్ఞానం కాదా? ఈటల రాజేందర్ తాను గెలిచి కమలం పార్టీ చేతికి ‘ఈటె’ను ఆయుధంగా బహుకరించాడన్న ఇంగితాన్ని మరిచిపోతే ఎట్లా? రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఇంతటి ఆసక్తికరమైన సందర్భం మరొకటి లేదు. ఏడేళ్ల పాలన ఒక ఎత్తు. ఒక ఉప ఎన్నిక ఫలితం తర్వాత రగులుకుంటున్న ‘రాజకీయ ఉపద్రవం’ మరొక ఎత్తు.

    రాజకీయ పరిశీలకులకు అనేక ప్రశ్నలను సంధిస్తున్న సందర్భమిది. సంభ్రమాశ్చర్యాలను మిగిల్చిన స్థితి ఇది. కేంద్రం ‘ధాన్య సేకరణ’ విధానం గురించి కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉంది. కేంద్ర ఆహార భద్రతా చట్టం ఏం చెపుతుందో కూడా ముఖ్యమంత్రికి తెలుసు. పండించిన సాంతం ధాన్యాన్ని కేంద్రం సేకరించదు. గతంలోనూ అలా జరగలేదు.

    దేశ వ్యాప్తంగా పండిన మొత్తం వరిపంటలో కేవలం 29 శాతం మాత్రమే కేంద్రం సేకరిస్తుందని కూడా కేసీఆర్ తెలుసు. దేశంలో పండే వివిధ పంటల సేకరణకు నిర్దిష్టమైన శాతాన్ని నిర్ణయిస్తారని కూడా తెలుసు. పాలనాపరమైన అంశాల్లో కేసీఆర్ కు స్పష్టమైన, అనుభవపూర్వకమైన అవగాహన ఉంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా నూటికి నూరు శాతం పంటలను కేంద్రం కొనుగోలు చేయలేదనే విషయం కూడా కేసీఆర్ కు తెలుసు. మోతాదులో హెచ్చు తగ్గులున్నాయని కూడా తెలుసు.

    అయితే ఎందుకీ ‘వరి పైరు పితలాటకం’ అనే సందేహం రావడం సహజం. సమస్య వరిధాన్య సేకరణ గురించి కాదు. వడ్లగింజ రూపంలో బీజేపీ కేసీఆర్ గొంతుకలో పడింది. దీన్ని తిప్పికొట్టేందుకు మళ్లీ అదే ఆయుధాన్ని తిరిగి సంధించడం మినహా మరోమార్గం లేని స్థితిలో కేసీఆర్ వడ్లగింజల వింతనాటకాన్ని తెలంగాణ రాజకీయ యవనికపై ప్రదర్శించనారంభించారు.

    ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ రాజుకుంటుందన్నదే ప్రధాన అంశం. మిగతా ఏ రంగాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా దాన్ని చల్లార్చే మాయోపాయాలు అధికారంలో ఉన్న పార్టీల వద్ద ఉంటాయి. కానీ, నిరసన ధాన్యారాశుల వద్ద పోగుపడితే దాన్ని చెదరగొట్టడం అంత సులభ సాధ్యం కాదు. రైతుల వ్యతిరేకత మొత్తం గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ వ్యతిరేకతగా తర్జుమా అవుతుందని చరిత్ర చాలాసార్లు నిరూపించింది. ఈ వ్యతిరేకతను రాశిపోసేందుకు బండి సంజయ్ ధాన్యం మార్కెట్లను సందర్శించడం కేసీఆర్ కు అపశకునంగా తోచింది.

    ఈ తరహా ప్రతికూల వాతావరణాన్ని దాని మానాన దానికి వదిలేస్తే ప్రమాదం మరింత పెద్దదైన తర్వాత నియంత్రించడం అసాధ్యమని సరిగ్గానే అంచనా వేశారు సీఎం కేసీఆర్. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే గూడుకట్టుకున్న నైరాశ్యం వ్యతిరేకతగా మారితే సదరు వ్యతిరేకతను ఎంతటి వ్యూహమైన, ఎన్ని కరెన్సీ కట్టలైనా, ఎన్ని మద్యం సీసాలైనా అడ్డుకట్ట వేయడం సాధ్యపడదని సకాలంలోనే గుర్తించారు. ఈ స్థితిని తారుమారు చేయాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగడం మినహా మరో మార్గం లేదని భావించారు. అందుకే ‘వడ్లగింజలు’ నాటకానికి తెరతీశారు.

    ‘మహాధర్నా’లో కేంద్రం పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. కేంద్రం దద్దమ్మ అనీ, గుడ్డిదనీ, మేధస్సు లేనిదనీ…తిట్టిపోశారు. మొదటి ప్రెస్ మీట్ నుంచి మహాధర్నా వరకూ కేసీఆర్ స్వరపేటికలో పరుష పదజాలమే సందడి చేసింది. మొదట్లో చెవికోసుకుని కేసీఆర్ ఉపన్యాసాలు, ప్రెస్ మీట్లు వినే ప్రజలు ఇటీవలి కాలంలో అంతగా ఆసక్తి చూపడం లేదన్న వాస్తవం కూడా ఈ వారం పది రోజుల వ్యవధిలోనే ప్రస్ఫుటమైంది.

    కేంద్రాన్ని లక్ష్యంగా ఎంచుకోకుండానే రాష్ట్రంలోని ప్రస్తుత ప్రతికూల స్థితిని నివారించవచ్చు. అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార బీజేపీని టార్గెట్ చేయడం వల్ల ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందన్న కనీస రాజకీయ వివేకం ఎందుకు లేకపోయిందన్న సందేహం రావడం సహజం. బండి సంజయ్ పర్యటనను విస్మరించి ఉంటే పరిణామాలు మరోలా ఉండేవి. అయితే ‘హుజురాబాద్’ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ లోని పరిణతిని కొంచెం కొంచెం కొరికేస్తోంది. అందకు ప్రతిస్పందనే ‘మహాధర్నా’ ఆగ్రహజ్వాల.

    అసెంబ్లీలో కావాల్సినంత బలం, శాసన మండలిలో మెజారిటీ ఉన్న పక్షం, సంస్థాగతమైన పట్టు ఉందని చెప్పుకుంటున్న పార్టీలో కేసీఆర్ మినహా రాజకీయ సంక్షోభాలు, సందిగ్ధతలను నివారించే సమర్థత ఉన్న మరో నాయకుడు లేడా? ‘నేనే రంగంలోకి దిగుతా’ అనడం కేసీఆర్ సమర్థతకు గీటురాయి మాత్రమే కాదు, పార్టీ అంతర్గత బలహీనతకు తార్కారణం కూడా.

    ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కమలం పార్టీని కూరలో కరివేపాకులా తీసేసిన కేసీఆర్ ఆరు నెలలు తిరక్కుండానే ప్రత్యర్థిగా అంగీకరించారు. ఈ ఆరు మాసాల్లో ఏం జరిగింది? ఏ పరిణామాలు బీజేపీని రెండో స్థానంలో తీసుకువచ్చాయి. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ బరిలో ఓడినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయినా ఉత్తరోత్తరా కమలం పార్టీ తన బలాన్ని పెంచుకుంది.

    అందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికలు దోహదం చేశాయి. ఎన్నికల గెలుపు కన్నా ప్రధానంగా బీజేపీ తెలంగాణలో తన ప్రభావాన్ని పెంచుకుంది. ఎన్నికల రాజకీయాల్లో గెలుపోటములు మాత్రమే రాజకీయ పార్టీల ప్రాబల్యాలను లెక్కించేందుకు ప్రమాణం కాదు. అది కూడా ఒకానొక అంశం మాత్రమే! బీజేపీ ప్రభావం పెరగడానికి కారణం పరోక్షంగా కేసీఆర్ కూడా అని చెప్పక తప్పదు. భిన్నప్రాయం వ్యక్తం చేసిన వారిని గేలి చేయడం, వ్యక్తిత్వాన్ని కాపాడుకుందామనుకున్నవారిని అవమానించడం, తన మాటే శాసనమని నొక్కి వక్కాణించడం లాంటి వ్యవహార శైలి….కేసీఆర్ వ్యతిరేకులను ఒక్కటి చేసింది. బీజేపీ వారిని చేరదీసింది.

    మొత్తంగా ఆరుమాసాల్లో పరిస్థితి తారుమారైంది. ఎదురే లేదని విర్రవీగిన టీఆర్ఎస్ కు ప్రత్యర్థి బల్లెంలా దూసుకువచ్చింది. ఈటల రాజేందర్ పై ఆరోపణలు చేసి, అవమానించి, బర్తరఫ్ చేసిన కేసీఆర్ తదనంతర పరిణామాలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. మంత్రివర్గ విస్తరణ పేరుతో ఈటలను పక్కనపెట్టి ఉంటే ఇంత అవమానభారం మిగిలేది కాదు.

    ‘మహాధర్నా’లో కేసీఆర్ కూటనీతి’ గురించి ప్రస్తావించారు. కేంద్రం కూటనీతి అవలంబిస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. యాదృచ్ఛికం కావచ్చు గానీ, కణికుడి కూటనీతి కేసీఆర్ కు కూడా వర్తిస్తుంది. ‘‘మనకు గురువైనా, పుత్రుడైనా, మిత్రుడైనా, తండ్రి అయినా, ఇంకెంత ఆత్మీయుడైనా శత్రుస్థానంలో ఉంటే చాలు… అతణ్ని తప్పక చంపాలి. అందర్నీ అనుమానిస్తూ ఉండాలి’’ అంటాడు కణికుడు తన కూటనీతిలో. ఈటల విషయంలో కేసీఆర్ ఇంతకన్నా భిన్నంగా వ్యవహరించారా? కాకపోతే ‘ఈటల’ను రాజకీయంగా హత్య చేయాలని విఫల ప్రయత్నం చేశారు.

    కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ విజయపరంపరను నిలువరించిన పార్టీలు మూడే మూడు. అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజూ జనతా దళ్.

    ఈ మూడు పార్టీలు వేరు వేరు ప్రత్యేకతల కారణంగా బీజేపీని నిలువరించాయి. ఆప్, తృణమూల్ పార్టీలు ఎన్నికల మైదానంలో బీజేపీని బలంగా ఢీకొన్నాయి. బిజూ జనతాదళ్ ను ఎదిరించే సంస్థాగతమైన పట్టులేకపోవడం వల్ల నవీన్ పట్నాయక్ కమలం పార్టీని నియంత్రించ గలిగారు.

    ‘మహాధర్నా’లో కేసీఆర్ గర్జించినట్టూ…నిజంగానే కేసీఆర్ బీజేపీని ఎదిరించి నిలబడగలరా అంటే అది అంత సులభసాధ్యమైన విషయం కాదు. మంద బలాన్ని నమ్ముకుని బలశాలికి సవాలు విసిరితే పరిస్థితి తారుమారు అవుతుందని భారతదేశ రాజకీయ చరిత్ర అనేక మార్లు రుజువు చేసింది.

    బీజేపీ బూచీని చూపి ‘డెమోగ్రఫిక్ అడ్వంటేజ్’ ను ఓట్లుగా మార్చుకునే అవకాశం మమత బెనర్జీకి లభించింది. నగర ఓటర్లను సమ్మోహన పరిచే ప్రణాళిక కేజ్రీవాల్ వద్ద ఉన్న కారణంగానే వారి విజయం సునాయాసమైంది. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి వద్ద సులభంగా శతృవును చిత్తు చేయగల ఆయుధమేది ఈ రాష్ట్ర రాజకీయ మైదానంలో లేదు.

    ‘మహాధర్నా’లో కేసీఆర్ ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగంలో తన అధికార పీఠాన్ని కదిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న  అంతర్మథన కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. దాన్ని తిప్పికొట్టేందుకు ఎదురుదాడి మినహా మరో మార్గం లేదని కేసీఆర్ విశ్వసిస్తున్నారని కూడా అర్థమవుతుంది.

    ఇలాంటి స్థితిలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నారు?

    మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను వెచ్ఛించిన శక్తిని….అధికార సాధన తర్వాత రహస్యస్థావరంలో దాచి ఉంచాననీ…తిరిగి తాజా స్థితిలో మళ్లి ఆవాహన చేస్తాననీ… అన్నట్టుగా ఉంది మహాధర్నా ఉపన్యాస సారం. సావధానంగా పాచికలు వేసే సమయం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక వేగంగా పావులు కదపడం మినహా మరో మార్గం లేదని బలంగా నమ్ముతున్నారు. సకల శక్తులూ ఒడ్డి, తిరిగి ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలన్న దీక్షతో బయలుదేరినట్టూ కేసీఆర్ ధోరణిని చూస్తే అర్థమవుతోంది. ‘‘ప్రత్యర్థిని అభాసు పాలు చేసి, కోల్పోతున్న ప్రజల విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టుకోవడం’’ కేసీఆర్ వ్యూహంలో అత్యంత కీలకమైంది. అందుకే బండి సంజయ్ పై, కేంద్రంపై అంత దూకుడుగా…పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘నేను మాత్రమే పరిష్కారం – మిగతా మొత్తం అబద్ధం’, ‘నేను చెప్పేది కఠోర సత్యం – ప్రత్యర్థి చెప్పేది పచ్చి అబద్ధం’ అనే రెండు వాక్కులను పదే పదే చెప్పి సమ్మతి సృష్టి చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ఆరంభించారు. రాబోయే రోజుల్లో అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచిచూడాలి.

    Trending Stories

    Related Stories