More

    దేశంలోని రైతుల వద్ద తెలంగాణ పరువు తీసిన కెసిఆర్..!

    తెలంగాణ సీఎం కెసిఆర్ రైతుల పక్షపాతి అనే నానుడి గతంలో ఉండేది. కానీ రాను రాను ఆయన రైతుల పట్ల వ్యవహారిస్తున్న తీరు అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు పంజాబ్, హర్యానా రైతుల వద్ద తెలంగాణ పరువు పోయింది. కేసీఆర్‌ నిర్వాకంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ధనిక రాష్ట్రం.. తమది రైతు ప్రభుత్వం, రైతులకు ఎంత చేసినా తక్కువే.. తెలంగాణ రైతులను తామే దేశానికే ఆదర్శంగా నిలిపాం అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పంజాబ్‌, హర్యానా రైతుల ముందు మన పరువు తీశాడు.

    రెండేళ్ల క్రితం కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మరణించిన 709 మంది పంజాబ్‌ రైతుల కుటుంబాలను ఆదుకుంటానని కేసీఆర్‌ అప్పట్లో గొప్పగా ప్రకటించారు. ఈ మేరకు గత మేలో పంజాబ్‌కు వెళ్లి మరీ.. 1010 చెక్కులు పంపిణీ చేశారు. అయితే కేసీఆర్‌ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ అంశంపై కేసీఆర్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

    తెలంగాణ చెక్కులు బౌన్స్‌ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విచారణ చేసింది. చెక్కులన్నీ క్లియర్‌ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మేలో కేసీఆర్‌ 1010 చెక్కులను పంపిణీ చేశారని.. అందులో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా చెక్కులు చెల్లింపులు జరగకపోవడానికి కూడా ప్రభుత్వం కారణం కాదన్నారు. బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని.. అలా చేయకపోవడంతో మిగిలిన 196 చెక్కులకు నగదు చెల్లింపులు నిలిపివేశారని అధికారులు ప్రకటించారు. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్‌ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోకటికాదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు.

    మూడు నెలలోపు బ్యాంకులో డిపాజిట్‌ చేయలేకపోయిన చెక్కులకు కూడా చెల్లింపులు చేయాలని ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ రాంసింగ్‌ ను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ సర్కార్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే కానీ.. ఇలా పరాయి రాష్ట్రంలో వారికి చెల్లని చెక్కులిచ్చేంత దుర్భర స్థితిలో లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సొంత రాష్ట్రంలో రైతులను పట్టించుకోని కెసిఆర్ ఇతర రాష్ట్రాల రైతులను ఆదుకుంటానని చెప్పి అబాసుపాలు అయ్యారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

    Trending Stories

    Related Stories