తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అయిన సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్‌రూమ్ ప్రారంభించానికి కత్తెర ఏర్పాటు చేయడం మరిచిపోయారు. దీంతో కొంత సమయం ఎదురుచూసిన సీఎం కేసీఆర్ కాస్త ఆగ్రహానికి గురయ్యారు. రిబ్బన్‌ను చేతితో చింపి పక్కకు జరిపి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర మరిచిపోయారు. కత్తెర ఏదీ అంటూ కేసీఆర్ ఆరా తీయగా కనిపించలేదు. కొద్దిసేపు వేచి చూసిన సీఎం ఒకింత ఆగ్రహానికి గురై రిబ్బన్ ను పక్కకు జరిపి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. మండెపల్లి వద్ద 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన హౌసింగ్ కమ్యూనిటీని ప్రారంభించడం జరిగింది. దీనికి ‘కేసీఆర్ నగర్’ అని పేరు పెట్టారు. 1,320 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను 80కోట్లతో 30ఎకరాల స్థలంలో చేపట్టారు. వాటిలో జీ+4లో 110 బ్లాక్‌లుండగా, ఒక్కో బ్లాక్‌కు 12 ఇండ్లను నిర్మించారు. ఒక్కో ఫ్ల్లోర్‌లో 4 ఇండ్లు ఉండేలా నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ ఏరియా 560 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో నిర్మించారు. ఫ్లాట్‌లో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్, కామన్‌బాత్‌రూం, అటాచ్డ్ బాత్రూం ఏర్పాటు చేశారు.