సీఎం కేసీఆర్ కు వైద్యులు ఏమి సూచించారు

0
762

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు య‌శోద‌ ఆసుప‌త్రికి చేరుకోవడంతో ఆయనకు ఏమైందా అనే టెన్షన్ అందరినీ కలవరపరిచింది. కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఎడ‌మ చేయితో పాటు కాలు కూడా లాగుతున్న‌ట్లుగా ఉంద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో ఆయ‌న‌కు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న‌ కోణంలో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు. యాంజియోగ్రామ్‌తో పాటుగా సిటీ స్కాన్‌, ఈసీజీ త‌దిత‌ర ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయ‌న‌ను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు.

కేసీఆర్‌కు పెద్ద‌గా అనారోగ్య స‌మ‌స్య‌లేమీ లేవ‌ని, ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటే అంతా స‌ర్దుకుంటుంద‌ని య‌శోద ఆసుప‌త్రి వైద్యులు చెప్పారు. గ‌డ‌చిన రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారు. ఎడమ చేయి లాగుతున్నట్లుగా ఉందని గురువారం ఉద‌యం స్వ‌యంగా కేసీఆరే ఫోన్ చేసి చెప్పారు. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో గురువారం ఉద‌యం య‌శోద ఆసుప‌త్రికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయ‌న‌కు తొలుత ఈసీజీ, ఆ తర్వాత 2డి ఎకో పరీక్షలు నిర్వహింరు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. యాంజియోగ్రామ్‌ కూడా చేశారు. ఆ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్‌ లేదని తేలింది. ఎడమ చేయి ఎందుకు లాగుతుందన్న కారణంగా ఎంఆర్‌ఐ చేశారు. మెడకు సంబంధించి ఎంఆర్‌ఐ, అలాగే బ్రెయిన్‌ ఎంఆర్‌ఐ కూడా చేశారు. స‌ర్వైక‌ల్ స్పైన్ ఎంఆర్‌ఐలో కొంత రూట్‌ నర్వ్‌ పెయిన్‌ ఉన్నట్లు గమనించారు. వారం రోజుల విశ్రాంతి తీసుకుంటే సీఎం కేసీఆర్ నార్మల్‌ అవుతారని వైద్యులు చెప్పారు రూట్ న‌ర్వ్ పెయిన్.. అది కూడా స్వ‌ల్ప స్థాయిలోనే ఉన్న స‌మ‌స్య మిన‌హా అన్ని ప‌రీక్ష‌ల్లోనూ మ‌రెలాంటి స‌మ‌స్య బ‌య‌ట‌ప‌డ‌లేదు. షుగర్, బీపీ పరీక్షలలో హెచ్చుత‌గ్గులు క‌నిపించ‌డంతో కంట్రోల్‌లో ఉండడానికి సూచనలిచ్చారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన విష‌యం బయటకు రావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. ”తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బండి సంజ‌య్ శుక్రవారం నాడు ట్వీట్ చేశారు.