Telugu States

కేంద్ర మంత్రి అమిత్ షా పై తీవ్ర విమర్శలు చేసిన సీఎం కేసీఆర్

మునుగోడులో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ‘జై తెలంగాణ’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నిక రావడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటో ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. గోల్ మాల్ చేసి ఉప ఎన్నిక వచ్చేలా చేశారు. ఇంకో ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక తేవాల్సిన అవసరం ఏమిటి? మిమ్మల్ని ఇలా ఎర్రటి ఎండలో నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుకాల మాయా మశ్చీంద్ర ఏమిటి? గుర్తించకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాక.. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లాం. పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ తెచ్చుకుని.. మిషన్ భగీరథ ప్రాజెక్టు తెచ్చి.. సురక్షిత మంచినీళ్లు ఇచ్చుకున్నాం. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామన్నారు. మొన్న సీపీఎం, సీపీఐ నాయకులతో ఒకే మాట చెప్పాను. మనమంతా విడిపోయి ఉండొద్దు. ఐక్యంగా ఉండాలి. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి, ఈ దుర్మార్గులను సాగనంపాలి. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, దేశం బాగుపడుతుందని అభిప్రాయాలను పంచుకున్నామన్నారు.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయిందని.. ఇప్పటికీ కృష్ణా నదిలో నీటి వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నారని.. నీటి వాటాలు ఎందుకు తేల్చడం లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై పోరాడుతామన్నారు. దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సమాజాన్ని విభజించే విద్వేష విధానాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చిస్తున్నామన్నారు. దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఐదారు నెలలుగా తలలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నామన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ సహా మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పోరాడుతామని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నదిలో నీటి వాటా తేల్చాలని కోరితే ప్రధాని నరేంద్ర మోదీ తేల్చడం లేదు. ఎందుకు తేల్చడం లేదు? ఇప్పుడు మునుగోడుకు ఎందుకు వస్తున్నారు. మా నీటి వాటా మాకు ఇవ్వనందుకే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారా? బిడ్డా.. అమిత్ షా సమాధానం చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకపోవడానికి కారణమేంటో చెప్పాలని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంద్రాగస్టు నాడు ప్రధాన మంత్రి మాట్లాడితే మైకులు పగలిపోయాయి. అందులో ఒక్క మాట అయినా మంచి మాట ఉందా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Back to top button