More

    అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్..!

    అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని, పరిహారం చెల్లించి రైతులను ఆదుకుంటామని చెప్పారు. పంటనష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపేదిలేదని, ఇంతకుముందు పంపిన వాటికే కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. ప్రతీ ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని అన్నారు. ఈ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.

    ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ ఖమ్మం బయల్దేరారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామాపురం చేరుకున్నారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, బాధిత రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణను వ్యవసాయ రాష్ట్రంగా నిలబెట్టుకుంటున్నామని, రైతులు అధైర్యపడొద్దని కెసిఆర్ భరోసా ఇచ్చారు.

    Trending Stories

    Related Stories