More

    మూడు రోజుల్లో రెండు సార్లు ప్రకాష్ రాజ్ తో కేసీఆర్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే..!

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నటుడు ప్రకాష్ రాజ్ వరుసగా భేటీ అవుతూనే ఉన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫాం హౌస్‌‌కు వెళ్లిన ప్రకాశ్‌‌ రాజ్‌‌ ఆయనతో చర్చలు జరిపారు. మూడు రోజుల వ్యవధిలో కేసీఆర్‌‌ను ప్రకాశ్‌‌ రాజ్‌‌ కలవడం ఇది రెండోసారి. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందు సీఎం కేసీఆర్​ను ప్రకాశ్‌‌ రాజ్‌‌ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్యసభ సీటు ఆశిస్తున్న వ్యాపారవేత్త దామోదర్‌‌ రావు కూడా కేసీఆర్‌‌ను కలిసినట్టు తెలిసింది. ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ బి.వినోద్‌‌ కుమార్‌‌ సైతం ఫాంహౌస్‌‌ కు వెళ్లి సీఎంను కలిశారు. బండ ప్రకాశ్‌‌ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. జూన్‌‌ 21తో ఖాళీ అయ్యే కెప్టెన్‌‌ లక్ష్మీకాంతారావు, డి. శ్రీనివాస్‌‌ రాజ్యసభ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌‌ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు ఆశావాహుల లిస్ట్ లో ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌కు ఇటీవల ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలిచారు. గతంలో మహారాష్ట్ర సీఎంను కలిసిన సందర్భంలోనూ ప్రకాష్ రాజ్‌ను తనవెంట తీసుకువెళ్లారు కేసీఆర్. ఇక ఇటీవల పలు మార్లు కేసీఆర్ ను ప్రకాష్ రాజ్‌ కలవడంతో ఆయనకు రాజ్యసభ సీటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానాల భర్తీకి జూన్‌ 10 ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. అలాగే యూపీలో 11, ఏపీలో 4స్థానాలు సహా మొత్తం 15 రాష్ర్టాల్లో 57 రాజ్యసభ ఎంపీ సీట్లకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో బండా ప్రకాశ్‌ రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీకి కూడా ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాల ఖాళీలు భర్తీకానున్నాయి. జూన్‌ 10 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కిస్తారు.

    Trending Stories

    Related Stories