బిర్జు మహారాజ్ ఇక లేరు.. ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

0
897

ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు పండిట్ బిర్జు మహారాజ్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 83 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. ఢిల్లీలోని సాకేత్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరణానికి గుండెపోటు కారణమని తేలింది. ఈ విషయం గురించి ఆయన మనవరాలు రాగిణి మహరాజ్ మాట్లాడుతూ, “ఆయన గత నెల రోజులుగా చికిత్స పొందుతున్నాడు. గత రాత్రి 12:15-12:30 am సమయంలో ఆయనకి అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడంతో.. 10 నిమిషాలలో ఆసుపత్రికి తీసుకువచ్చాము, కానీ అప్పటికే చనిపోయారు” అని తెలిపారు.

ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్‌లో సంతాప సందేశాన్ని పంచుకున్నారు. “భారతీయ నృత్య కళకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును అందించిన పండిట్ బిర్జూ మహారాజ్ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి!” అంటూ ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌, లక్నోలోని ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ అసలు పేరు దుఃఖ్ హరణ్. ఆ తర్వాత దానిని పండిట్ బ్రిజ్మోహన్‌గా మార్చుకున్నారు. బ్రిజ్మోహన్ నాథ్ మిశ్రాకు పొట్టి రూపమే బిర్జూ. కథక్ డ్యాన్సర్‌గానే కాక గాయకుడిగానూ ఆయన ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ కూడా అందుకున్న పండిట్ బిర్జుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఖైరాగఢ్ యూనివర్సిటీలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. 1986లో భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీరావ్ మస్తానీ వంటి బాలీవుడ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. ‘దిల్‌తో పాగల్ హై’, ‘దేవదాస్’ సినిమాల్లో మాధురి దీక్షిత్‌ పాటలకు నృత్య దర్శకత్వం వహించారు. యూకే, జపాన్, యూఎస్, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో నిర్వహించిన భారతీయ పండుగల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఆయనను భారత ప్రతినిధిగా పంపింది. పలువురు ప్రముఖులు బిర్జు మహారాజ్ మృతికి సంతాపం తెలిపారు.