జమ్మూ కశ్మీర్.. ఒకప్పుడు అక్కడి పరిస్థితులు వేరు.. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు..! మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలను, ఆదాయ వనరులను తీసుకుని వస్తున్నారు. అందుకే మోదీపై కశ్మీరీలలో కూడా అభిమానం మరింతగా పెరిగిపోతోంది. నరేంద్ర మోదీ హయాంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు ఆ ప్రాంతంలోని ఓ యువకుడిని ఆకర్షించాయి. దీంతో మోదీ మీద అభిమానం చూపించడానికి అతడు పాదయాత్రనే ప్రారంభించాడు.
మోదీని కలవడానికి 815 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాలని కశ్మీర్ కు చెందిన ఫాహిమ్ నజీర్ షా అనే యువకుడు భావించాడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఈ పాదయాత్ర మొదలుపెట్టాడు. శ్రీనగర్‌లోని షాలిమార్ వాసి అయిన నజీర్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. తన యాత్రలో భాగంగా ఇప్పటికి 200 కిలోమీటర్లు నడిచి, ఆదివారం నాడు ఉధంపూర్ నగరానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మోదీకి వీరాభిమానినని తెలిపాడు. కొన్ని సంవత్సరాల క్రితం మోదీ ర్యాలీ సమయంలో సమీపంలోని మసీదు నుండి ‘అజాన్’ వచ్చిందని, అప్పుడు ప్రధాని కొద్దిసేపు మాట్లాడటం మానేశారని అది తన మనసును తాకింది.. ప్రార్థనను అంతగా గౌరవించారని.. మోదీ చూపిన ఆ సంస్కారం తనను ఆకర్షించిందని అప్పటి నుండి తాను ప్రధాని మోదీకి ఆరాధకుడు అయ్యానని వెల్లడించారు. మోదీని కలవడానికి రెండుసార్లు ఢిల్లీ వెళ్లాను. కానీ, దురదృష్టవశాత్తు, నేను ఆయన్ను కలవలేకపోయాను అని ఫహీమ్ నజీర్ ఉధంపూర్ సమీపంలో మీడియాతో మాట్లాడాడు. తాను ఆయనను కలవడానికి కాలినడకన ఢిల్లీకి వెళుతున్నానని తెలిపాడు. ఇలా కాలినడకన వెళ్తే మోదీని కలిసే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. రెండున్నర సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని అన్నాడు. కశ్మీర్‌కు మోదీ వచ్చినప్పుడు ఆయనను కలిసేందుకు భద్రతా సిబ్బంది తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. పాదయాత్ర చేస్తుండడంతో ఈ సారి మోదీని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
ఇంతకుముందు, అభివృద్ధి నెమ్మదిగా సాగేది. కానీ ఆర్టికల్ 370 & 35A రద్దు తర్వాత అక్కడి పరిస్థితులు మారాయి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం.. అభివృద్ధి పనులు చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో యువత మోదీ ప్రభుత్వం పనితీరుపై సంతోషంగా ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో మార్పు కనిపిస్తోందని.. కశ్మీర్ లో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపాడు నజీర్.