జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల పలువురిపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు తాజాగా బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో కశ్మీరి టీవీ నటి అమ్రీన్ భట్‌ను కాల్చి చంపారు.
ఇదే ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ గాయపడ్డాడు. పదేళ్ల బాలుడి చేతికి బుల్లెట్ గాయమైందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అమ్రీన్ భట్ తల్లిదండ్రులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ బంధువు జుబైర్ అహ్మద్ మాట్లాడుతూ బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు షూటింగ్ ఉందంటూ పిలిచేందుకు ఇంటికి వచ్చారని తెలిపారు.
అమ్రీన్ బయటకు షూటింగ్‌కు రానని చెప్పడంతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏం తప్పు చేసిందని కాల్పులు జరిపారని ప్రశ్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు తెగబడింది లష్కరే ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్రీన్‌కు టిక్‌టాక్, యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇవాళ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి.