More

    ఉత్తర దక్షిణ సాంస్కృతిక వారధి.. కాశీ – తమిళ సంగమం..!

    మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతీ రోజూ అనేక ఉపయోగకరమైన, ఆసక్తికరమైన, సకారాత్మకమైన వార్తా అంశాల్ని కావాలనో, కనిపించకో.. వదిలేస్తూ ఉంటుంది. అటువంటి ఓ నిర్లక్ష్యం చేయబడ్డ బృహత్తర జాతీయవాద, ఆధ్మాత్మిక అద్భుత కార్యక్రమమే.. కాశీ తమిళ సంగమం..! ప్రధాని మోదీ తన స్వంత నియోజక వర్గం వారణాసిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర మంత్రులు, మరికొందరు హాజరయ్యారు. వేదికపై నరేంద్ర మోదీ తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా అడ్డ పంచె కట్టి దర్శనం ఇచ్చారు..! ఇంతే.. కాశీలో తమిళ పంచె కట్టులో మోదీ కనిపించడం గురించి ఒక చిన్న వార్త రాశారు గానీ.. కాశీ తమిళ సంగమం గురించి పెద్దగా మాట్లాడలేదు..!

    దక్షిణాదిన సముద్ర తీరాన ఉన్న తమిళనాడు.. ఉత్తరాదిన గంగా తీరంలో విరాజమానమైన కాశీ.. ఈ రెండూ మన దేశంలో రెండు ధృవాల వంటివి. అయితే, గంగ ఒడ్డున ఉన్నది విశ్వానథుడైన శివుడు. సముద్ర తీరాన దక్షిణంలో ఉన్నది కూడా రామేశ్వరుడైన శివుడే..! భారతదేశం అనాదిగా శివమయం..! ఆ విషయాన్నే ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమం ప్రారంభిస్తూ నొక్కి చెప్పారు మోదీ. ఉత్తరం, దక్షిణం అంటూ గీతలు గీయటానికి ప్రయత్నించే మెకాలే గోత్రపు మేధావులకి సహజంగానే ఇదంతా నచ్చటం లేదు. తమిళనాడులో కమ్యూనిస్టులైతే కాశీని, తమిళనాడుని కలిపే మోదీ ప్రయత్నాన్ని బాహాటంగా తప్పుబడుతున్నారు. వారి దృష్టిలో.. నెల రోజుల పాటూ తమిళనాడు నుంచి 2500 మందిని పలు బృందాలుగా కాశీకి తీసుకుని వెళ్లటం ఆరెస్సెస్ కుట్ర..! విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాలకు చెందిన వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, సాహిత్య, వారసత్వ, సాంస్కృతిక అంశాలపై ఆసక్తి కలిగిన వారు.. వీరంతా తమిళనాడు నుంచి బయలుదేరి.. వారణాసి చేరుకుంటున్నారు. డిసెంబర్ ప్రారంభమయ్యే నాటికి మూడు విడతలుగా తమిళ బృందాలు కాశీకి చేరుకున్నాయి. వారికి విశ్వనాథుడి దర్శనం, అన్నపూర్ణా దేవి ప్రసాదమైన భోజనం, గంగా స్నానం, ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలోనూ పుణ్య స్నానం.. ఇవన్నీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రం సమకూరుస్తున్నాయి..! ఈ నేపథ్యంలో రాజకీయ దివాళాకోరు మాటలు మొదలయ్యాయి. దీనివల్ల తమిళనాడులో, పుదుచ్చేరిలో, వీలైతే కేరళలో జొరబడిపోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందట..! ఇప్పుడు తమిళనాడు నుంచి కాశీకి వస్తోన్న వివిధ రంగాల్లోని వారంతా రేపు కాషాయ పార్టీకి మేలు చేస్తారని ఎర్ర జెండాల వారు అదే పనిగా మూలుగుతున్నారు. వారి వెనుక మౌనంగా స్టాలిన్ ప్రభుత్వం ఉందన్నది అందరికీ తెలిసిందే..! ఉత్తర, దక్షిణ విభజన వాదపు ఆర్య, ద్రవిడ సిద్ధాంతం.. కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా వాడుకున్నది డీఎంకే పార్టీనే కదా..!

    మోదీ తలపెట్టిన కాశీ తమిళ సంగమం చారిత్రక కార్యక్రమానికి రాజకీయ పరమైన విమర్శలు రావటం అందరూ ఊహించిందే..! పైగా తమిళనాడులోకో, కేరళలోకో ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నికల ద్వారా బీజేపీ ప్రవేశించాలనుకుంటే.. అది రాజ్యాంగం సాక్షిగా తప్పు కూడా కాదు. కానీ, జాతీయ సమైక్యతకి ఉపయోగపడే కాశీ తమిళ సంగమం వంటి ఈ కార్యక్రమంలో.. అధికారికంగా పాల్గొనమంటే.. కేంద్రం ఆహ్వానాన్ని, అభ్యర్థనని కనీసం పట్టించుకోలేదు స్టాలిన్ సారు..! ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దేశ ప్రేమ ఆ స్థాయిలో ఉంటుంది. అయితే.. ఈ రాజకీయ కోణం పక్కన పెడితే.. మనం కాశీ తమిళ సంగమాన్ని చారిత్రక, సాంస్కృతిక, సనాతన కోణంలో తప్పక చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఆ సేతు హిమాచలం అని పిలవబడుతోన్న అఖండ భారతదేశం.. అగస్త్యుడు మొదలు ఆది శంకరుల వరకూ గంగ నుంచీ సముద్రం దాకా.. ఒకే ఒక సజీవ సందేశమై వర్ధిల్లింది..! తరువాతి కాలంలో విధి వక్రించి మన దేశంపైకి విదేశీయులు, విధర్మీయులు దండెత్తి వచ్చారు. వారి వల్ల వేల ఏళ్ల కాశీ, రామేశ్వర సమాగమం కొన్నాళ్లు కొద్దికొద్దిగా కుంటుపడింది. ఇప్పుడు మళ్లీ యావత్ భారతదేశం ఏకమవ్వటం కోసం.. బ్రిటీషు వాడు చెప్పిన స్వార్థపూరిత విభజన వాదం.. గంగలో కలిపేందుకోసం.. తమిళనాడులో బయలుదేరి హిందూ సమాజం వారణాసి చేరుకుంటోంది..! ఇది అత్యంత శుభ సూచకం.

    జాతీయవాదులు దేశం కలిసి ఉండాలనుకోవటం, వారి వ్యతిరేకులు ఏ ఇద్దరూ ఐక్యంగా ఉండకూడదని భావించటం.. అంతటా, ఎప్పుడూ ఉండేదే. మన దేశంలోనూ కొన్ని దశాబ్దాల క్రితం అదే జరిగింది. ముఖ్యంగా, తమిళనాడులో అగ్రవర్ణాల మీద దళితుల న్యాయబద్దమైన పోరాటం గతి తప్పి ప్రాంతీయవాదం, భాషావాదం, వేర్పాటువాదం దాకా వెళ్లిపోయింది. అప్పుడెప్పుడో పెరియార్ చెప్పిన పాఠాలే ఇప్పటికీ ద్రవిడ నేతలు, మేధావులు వల్లిస్తుంటారు. సామాన్య జనం ఉత్తర, దక్షిణ విభేదాలు మరిచే అవకాశం వచ్చిన ప్రతీసారీ తమిళుల్ని మిగతా దేశం మొత్తం నుంచి విడదీస్తుంటారు. ఈ మధ్య కూడా స్టాలిన్ పార్టీకి చెందిన ఓ నాయకుడు మాకు ప్రత్యేక దేశం కావాలంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడేశాడు. వారికి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి లభిస్తోన్న ప్రజాదరణ రోజురోజుకి ఇబ్బందిగా మారుతోంది. అందుకే, కాశీ తమిళ సంగమం కార్యక్రమం మొత్తాన్నీ బీజేపీ రాజకీయ ఎజెండాగా చూస్తున్నారు. ఒకవేళ అదే నిజమైనా.. ఇంత కాలం తమళ భాష పేరుతో, హిందీ వ్యతిరేకతతో, ద్రవిడ సిద్ధాంతపు రాద్దాంతంతో.. అధికారం, అవార్డులు సంపాదించుకున్న వారికి చెక్ పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది.

    కాశీ తమిళ సంగమం ప్రధాన ఉద్దేశం.. అతి పురాతన కాశీకి, మహా చరిత్ర కలిగిన తమిళ ప్రాంతానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోమారు సుస్పష్టం చేయటమే. మనం ఓసారి పురాణాల్లోకి వెళితే.. అగస్త్యుడి కథ వినిపిస్తుంది. ఆయన శివపార్వతుల కళ్యాణం సమయంలో హిమాలయం నుంచి బయలుదేరి వింధ్య పర్వతాలు దాటుకుని దక్షిణాపథానికి వచ్చారట. మనుషులు, దేవతలు, గంధర్వులు మొదలైన వారంతా పార్వతీ కళ్యాణం వీక్షించటం కోసం ఉత్తరానికి చేరుకోవటంతో.. అటువైపు భారం పెరిగిందని పురాణ కథ. దాని ప్రభావం తగ్గించటం కోసం అగస్త్యుడు దక్షిణానికి వచ్చేశాడు. అందుకే, ఇప్పటికీ ఉత్తరాదిలో కన్నా దక్షణంలో మనకు అగస్త్యుడి పేరు, ఆయన సంచరించిన స్థలాలు, ప్రతిష్ఠించిన లింగాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఈ పురాణ కథ వేల ఏళ్లుగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు ఉన్న సంబంధాన్ని నిరూపిస్తుంది. తెల్ల వాళ్లు వచ్చాక సృష్టించిన ఆర్యులు, ద్రవిడులు వంటి మాటలన్నీ ఒట్టివేనని చెప్పకనే చెబుతుంది.

    అగస్త్యుడే కాదు తరువాతి కాలంలో శ్రీరాముడు కూడా ఉత్తరాన ఉన్న అయోధ్యలో బయలుదేరి దక్షిణ సముద్రం దాటి రావణ లంక వరకూ కాలినడక సాగించాడు. రాముడికి కూడా ఈనాటి తమిళనాడు ప్రాంతంతో గొప్ప అనుబంధం ఉంది. ఆయన ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్నే మనం రామేశ్వరంలో నిత్యం పూజిస్తాం. పెరియర్ అనుయాయులు ఎంతగా విభజన వాదం బోధించిన రామేశ్వరంలో ఇప్పటికీ తమిళులు రాముడు ప్రతిష్ఠించిన శివ లింగానికే అభిషేకాలు చేస్తారు. అంతేకాదు, దేశంలోని ఎందరెందరో హిందువులు ప్రతీ యేటా గంగలోని నీరు, మట్టీ తెచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలుపుతారు. మళ్లీ సముద్రపు నీరు, మట్టీ ఉత్తరాదిన గంగలో నిమజ్జనం చేసేందుకు తీసుకు వెళతారు. ఇదంతా వేలాది ఏళ్లుగా సాగుతూనే ఉంది..! అదే కాశీ తమిళ సంగమం అని కూడా మనం భావించవచ్చు..!

    శ్రీరాముడి వంశానికి కుల దైవం ఎవరో మీకు తెలుసా..? తమిళనాడులోని శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథుడు..! ఆ కాలం నుంచి మొదలైన ఉత్తర, దక్షిణ భారతాల బాంధవ్యం మనకు మహాబలిపురంలో పంచ పాండవుల రథాల రూపంలోనూ దర్శనమిస్తుంది. అందుకే, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ని మహా బలిపురానికి ఆహ్వానించి.. ప్రత్యేక అతిథ్యం ఇచ్చారు..! డీఎంకే, కాంగ్రెస్ కలసి పాలన చేసి రోజుల్లో ఏ ఒక్క నాడూ అటువంటి గౌరవం దక్కలేదు. అయినా కూడా జాతీయ సమైక్యతకి, తమిళ గౌరవానికి తాపత్రయపడుతోన్న మోదీదే రాజకీయం అనటం.. మన మేధావులకే చెల్లింది..!

    సరే మరోసారి చరిత్రలోకి తొంగి చూద్దాం.. పురాణాలు, రామాయణ, భారత కాలాల్లోనే కాదు.. చారిత్రక శకం మొదలయ్యాక కూడా ఆదిశంకరులతో మొదలై 1960లు, 70ల కాలం నాటి కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి దాకా ఎందరెందరో యావత్ భారత దిగ్విజయ యాత్ర చేశారు..! కాషాయం దక్షిణంలో మొదలై ఉత్తరాన్ని చుట్టి రావటం ఇప్పుడు కొత్తేం కాదు. రామానుజులు, మధ్వాచార్యులు ఇటు నుంచి అటు వెళితే.. స్వామి వివేకానంద వంటి వారు అనేక మంది అటు నుంచీ ఇటుగా వచ్చారు..! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. కాశీ తమిళ సంగమం ఎప్పుడూ ఉన్నదే. సంస్కృతంతో పాటూ తమిళమూ ఈ దేశంలో చరిత్రకి అందని కాలం నుంచి గంగ, యమునల మాదిరిగా ప్రవహిస్తూనే ఉంది. వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభోత్సవంలో మోదీ అదే గుర్తు చేశారు. అత్యంత ప్రాచీన నగరమైన కాశీలో అత్యంత ప్రాచీన సజీవ భాష అయిన తమిళాన్ని తగినంతగా గౌరవించుకోవాలని అన్నారు.

    స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తోన్నా.. గతంలోనే చేయాల్సిన పనులెన్నో ప్రస్తుతం నమో చేస్తున్నారు. అందులో ఒకటే కాశీ తమిళ సంగమం కూడా. ఉత్తర, దక్షిణాల చారిత్రక, సాంస్కృతిక, సనాతన ఐకమత్యాన్ని ఈ నెల రోజుల పాటూ సాగే బృహత్తర కార్యక్రమం పట్టి చూపుతుంది. దీన్ని మనం.. ఎవరో కొందరు తమిళనాడులో బయలుదేరి కాశీకి చేరి.. తిరిగి దక్షిణానికి ప్రయాణం చేయటంగా భావించకూడదు. కాశీ తమిళ సంగమం ఓ నిరంతర మార్పుకు తొలి శ్రీకారం..! భారతీయ అవిచ్ఛిన్న సమాజానికి ఆధునిక సంకేతం..! అందుకే, మన ఈ కాశీ తమిళ సంగమం చర్చని ఓ కొసమెరుపుతో ముగిద్దాం..!

    ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి జిల్లా కలెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన పరిధిలోకే ప్రధాని మోదీ నియోజక వర్గమైన వారణాసి, విశ్వనాథుని కాశీ మహా క్షేత్రం కూడా వస్తాయి..! అతనే.. తమిళనాడులో ఉన్న తిరునల్వేలీ జిల్లాలోని కదయనల్లూరుకు చెందిన.. రాజలింగం..! అతనే ప్రస్తుత వారణాసి కలెక్టర్..! ఇందులోని విశేషం ఏంటో అర్థమైంది కదా..? తమిళనాడులోని ఓ పౌరుడు వారణాసికి కలెక్టర్ కాగలిగాడు..! విశ్వనాథుని మహాక్షేత్రాన్ని పర్యవేక్షించగలుగుతున్నాడు..! ఇదే కాశీ తమిళ సంగమం అంటే..! అటువంటి భారతీయ ఉత్తర, దక్షిణ సమైక్యతని సగర్వంగా చాటుకోవటమే.. కాశీ తమిళ సంగమం ముఖ్యోద్దేశం..! జయహో భారత్..! ఏక్ భారత్… శ్రేష్ఠ్ భారత్..! Everything Apart Nation First..!

    Trending Stories

    Related Stories