More

    మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురానున్న మరో రాష్ట్రం.. సంక్షేమ పథకాల నిలిపివేత..?

    కర్ణాటకలో త్వరలో మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం నాడు తెలిపారు. బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు రూపొందించిన సంబంధిత చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, త్వరలో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందిస్తామన్నారు. బలవంతపు మత మార్పిడులపై ఇప్పటికే పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఈ చట్టాలను అమలు చేస్తూ శిక్షలు విధిస్తూ వస్తున్నారు. ఇకపై కర్ణాటకలో కూడా మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకు రావడం తథ్యమని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.

    మత మార్పిడిని నిషేధించాలని కోరుతూ ఇటీవల జరిగిన సమావేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. హిందూ మతానికి చెందిన 50 మందికి పైగా హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు కొద్దిరోజుల కిందట బొమ్మైను కలిశారు. బలవంతపు మత మార్పిడిలపై నిషేధం విధించాలని సీఎంను కోరారు. సీఎంను కలిసిన వారిలో హిందూ జనజాగృతి సమితి కన్వీనర్ మోహన గౌడ, శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాళిక్, సంతోష్ గురూజీ, సిద్ధలింగ స్వామి, ప్రణవానంద స్వామి తదితరులు ఉన్నారు.

    ప్రమోద్ ముతాళిక్ మాట్లాడుతూ, స్కూళ్లు, ఆసుపత్రులను మతమార్పిడిలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇల్లీగల్ గా ఎన్నో చర్చిలు పుట్టుకొస్తున్నాయని.. మతాన్ని మార్చుకునే ఎస్సీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలని సీఎంకు వీరంతా సూచించారు. మత మార్పిడిని నిషేధించే చట్టం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రలోభాలతో సహా బలవంతపు మతమార్పిడిని రాజ్యాంగం అనుమతించదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.

    Trending Stories

    Related Stories