More

  ప్రమాదం కాదది.. యాక్ట్ ఆఫ్ టెర్రర్..! మంగళూరు ఆటోలో పేలుడు – రంగంలోకి NIA..!!

  కర్నాటక మంగళూరులో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. మహ్మద్ షరీక్ అనే వ్యక్తి ఆటోలో ప్రయాణిస్తుండగా ఐఈడీ బాంబుతో ఉన్న ప్రెజర్ కుక్కర్ పేలి డ్రైవర్ తో పాటు నిందితుడికి కూడా గాయాలయ్యాయి. మొదటగా దీన్ని సాధారణ ప్రమాదంగా అందరూ భావించినా,.. తర్వాత కర్నాటక డీజీపీ దీన్ని ‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’ అని ప్రకటించడంతో ఇది ఉగ్రవాద చర్యగా తెలిసింది. ఈ ఘటనపై కర్నాటక పోలీసులతో పాటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు జరుపుతుందని డీజీపీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. అయితే ఇందులో బాంబును తీసుకెళుతున్న మహ్మద్ షరీక్ ఇంతకుముందే దేశద్రోహ చట్టం క్రింద అరెస్టయ్యి బెయిల్ పై బయటకొచ్చాడని పోలీసులు గుర్తించారు. మహ్మద్ షరీఖ్ పై గతంలో దేశద్రోహచట్టంతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తో సంబంధాలున్నట్లు కూడా వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు కర్నాటకలోని షిమోగా జిల్లాలో వీర్ సావర్కర్ పోస్టర్ ను ప్రదర్శించిన వ్యక్తిని కత్తితో పొడిచిన కేసులో కూడా మొహమ్మద్ షరీఖ్ నిందితుడేనని ప్రాథమిక సమాచారంలో తెలిసింది. ఇదే సంవత్సరం మొదట్లో కర్నాటకలోని తుంగ నది ఒడ్డున బాంబు పేలుడుకు ప్రయత్నించిన ఘటనలో ముగ్గురు నిందితుల్లో మొహమ్మద్ షరీఖ్ కూడా ఉన్నాడని తేలింది.

  అయితే ఈ కేసుల కంటే ముందే మొహమ్మద్ షరీఖ్ ను కర్నాటక పోలీసులు యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు. మంగళూరులో గోడలపై వివాదాస్పద వ్యాఖ్యలను గ్రాఫిటీ పెయింటింగ్ వేయడం వల్ల ఇతడిని దేశద్రోహ చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. తర్వాత ఎన్నో ఉగ్ర చర్యలకు పాల్పడినా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విధంగా నిందితుడు తప్పించుకు తిరగడం కోసం వేరే వ్యక్తి దగ్గర ఆధార్ కార్డును కూడా కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజా బాంబ్ బ్లాస్ట్ సమయంలో కూడా నిందితుడి దగ్గర హుబ్బలిలో నివసిస్తున్న ప్రేమ్ రాజ్ అనే 24 ఏళ్ళ యువకుడి ఆధార్ కార్డును పోలీసులు గుర్తించారు. ఇక మొహమ్మద్ షరీఖ్ నివాసముంటున్న అద్దె ఇంటిని కూడా పోలీసులు పరిశీలించగా,.. బాంబుల తయారీ కోసం ఉపయోగించే వస్తువులు బయటపడ్డాయి. పేలుడు పదార్థాలు, సర్క్యూట్ బోర్డులు, సల్ఫ్యూరిక్ యాసిడ్, చిన్న బోల్ట్‌లు, బ్యాటరీలు, మొబైల్ డిస్‌ప్లేలు, చెక్క పొడి, అల్యూమినియం ఫాయిల్, వైర్లు, మిక్సర్ జార్లు, ప్రెజర్ కుక్కర్లు కూడా లభించాయి. దీంతో ఈ బాంబు బ్లాస్ట్ పై పోలీసులు, ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ పేలుడుకు పాల్పడిన వ్యక్తిని గతంలోనే పోలీసులు యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేసినా అతడికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఈ చట్టంపై మరోసారి ప్రజలు సందేహాలు లేవనెత్తుతున్నారు.

  యూఏపీఏ చట్టం బ్రిటిష్ కాలంనాటిదైనా ఇప్పుడు ఈ చట్టాన్ని ఉగ్రవాదులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే కోణంలో అటు సోకాల్డ్ ఉదారవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలనీ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశ ద్రోహ చట్టం అనేది బ్రిటిష్ కాలంలో రూపొందించినా కూడా దాని అవసరం ఇప్పటికీ ఉంది. ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై దేశద్రోహ చట్టం ద్వారా నిలువరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ యూఏపీఏ చట్టమే లేకపోతే ఉగ్రవాదులపై కేవలం హత్యా ప్రయత్నం లాంటి కేసులు మాత్రమే విధించే అవకాశముంటుంది. ఇటువంటి కేసుల్లో సరైన కారణం చూపితే విచారణ సమయంలో కూడా నిందితులకు బెయిల్ వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే ఉగ్రవాదులకు మరింత స్వేచ్చ కల్పించినట్లవుతుంది. ఈ విధంగా జరగకూడదంటే ఇప్పటికే ఉన్న యూఏపీఏ చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సిఉంది. అంతేకాదు, యూఏపీఏ చట్టం కింద అరెస్టైన ఉగ్రవాదులకు బెయిల్ ఇచ్చే సందర్భంలో కోర్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. లేకపోతే మొహమ్మద్ షరీఖ్ లాగా బెయిల్ పై బయటకు వచ్చి మరిన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే అవకాశమూ లేకపోలేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. పదిమందికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.

  Trending Stories

  Related Stories