హిజాబ్ పై సంచలన తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

0
717

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సరైనదని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు.. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదని అన్నారు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదని సూచించారు.

విద్యాసంస్థలు చెప్పిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుందని అన్నారు. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం వారి ప్రాథమిక హక్కు కిందకు వస్తుంది. అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చని అన్నారు. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు బెంగళూరులో భారీ సభలు, సమావేశాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. స్కూళ్లు, కాలేజీ ఇతర విద్యాసంస్థల్లో మతసంబంధమైన దుస్తులు ధరించడాన్ని గత నెల 5న కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలోనే ఉడుపిలోని పీయూసీ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను యాజమాన్యం అనుమతించలేదు.

తాజాగా హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ, విద్యార్థులు ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది ధర్మాసనం. మంగళవారం తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని స్పష్టం చేసింది. స్కూల్ యూనిఫాం అనేది సహేతుకమైన పరిమితి అని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని వ్యాఖ్యానించింది. హిజాబ్‌ తీర్పు నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.