కర్ణాటకలో మూడు రోజుల పాటూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సీఎం బొమ్మై

0
965

కర్ణాటకలో బురఖాల వివాదం మంగళవారం నాడు తీవ్ర రూపం దాల్చడంతో, రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. “శాంతి, సామరస్యాన్ని కాపాడాలని నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్ , కాలేజీలను మూసివేయాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించిన వారందరూ సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని బొమ్మై ట్వీట్ చేశారు.

మంగళవారం కర్ణాటకలోని ఉడిపి, శివమొగ్గ, బాగల్‌కోట్‌ తదితర ప్రాంతాల్లోని కొన్ని విద్యాసంస్థల వద్ద హిజాబ్‌ అంశంపై ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రాళ్లదాడి, హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని విద్యా సంస్థలపై రాళ్లు రువ్వడం ప్రారంభించిన గుంపును అణిచివేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ను ప్రయోగించారు. రాళ్లదాడి ఘటనల్లో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. శివమొగ్గ, బాగల్‌కోట్, ఉడిపి, ఇతర ప్రాంతాల్లోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలపై రాళ్లదాడి, హింసాత్మక సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని బన్‌హట్టి పట్టణంలోని రబకవిబనహట్టి ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో కాషాయ కండువా ధరించిన విద్యార్థులు ముస్లిం బాలికలను హిజాబ్‌లతో కళాశాలలోకి అనుమతించకపోవడంతో ముస్లింల బృందం కళాశాలపై రాళ్లు రువ్వింది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని, అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది.

https://twitter.com/AkshayKatariyaa/status/1490965226170109952

మరో వీడియోలో @AkshayKatariyaa అనే ట్విట్టర్ యూజర్ కాషాయపు శాలువాలతో కాలేజ్‌కి వెళ్తున్న హిందూ విద్యార్థులను బెదిరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల పరిసర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జూనియర్ కళాశాల సమీపంలో ప్రైవేట్ బస్సులపై హిజాబ్ అనుకూల గ్రూపులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గుంపును అణిచివేసేందుకు విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసినట్లు సమాచారం. కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

కర్ణాటకలోని ఉడిపి MGM కాలేజీలో రెండు గ్రూపుల విద్యార్థులు వాగ్వాదానికి దిగినట్లు కూడా నివేదించబడింది. పరిస్థితి విషమించడంతో కళాశాల విద్యార్థులందరినీ బయటకు పంపి నిరవధిక సెలవు ప్రకటించినట్లు సమాచారం. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విజయపుర జిల్లా ఇండి పట్టణంలోని శాంతేశ్వర్ ప్రీ యూనివర్సిటీ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద హిజాబ్, కాషాయ కండువా ధరించిన విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్ ముందు గుమిగూడి నినాదాలు చేశారు.