కరోనా వచ్చినా కూడా పార్టీలు, ఈవెంట్ లకు హాజరైన కరీనా కపూర్ ఖాన్

0
700

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మరో సారి వార్తల్లో నిలిచారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా ఆమె ఈవెంట్ లకు పార్టీలకు హాజరు అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరీనా కపూర్ ఖాన్ , అమృతా అరోరా కరోనా పాజిటివ్ వ‌చ్చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికార వర్గాల ప్రకారం, సీమా ఖాన్‌కు మొదట కరోనా పాజిటివ్ అని తేలింది. డిసెంబర్ 11, 2021న ఆమె కోవిడ్ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత కరీనా కపూర్, అమృతా అరోరా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో వీరికి కూడా కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ‘ఫేబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ నటీనటులు డిసెంబర్ 8, 2021న దర్శకుడు కరణ్ జోహార్ పార్టీకి హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా కరీనా, అమృత వరుసగా ముంబైలోని పలు పార్టీలకు హాజరవుతున్నారు. కోవిడ్‌ నిబంధనలు మాత్రం పాటించలేదని తెలుస్తుంది. ముంబైలో అనిల్‌ కపూర్‌ కుమార్తె రియా కపూర్‌ నిర్వహించిన ఓ పార్టీకి సైతం వీరు హాజరయ్యారు. కరీనా, అమృతా అరోరాలకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గత కొన్ని రోజులుగా వీళ్లను కలిసిన వాళ్లంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది.

ఈ నేప‌థ్యంలో కోవిడ్ కేసు న‌మోదు కావ‌డంతో పార్టీకి హాజ‌రైన వారంతా ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం. కరీనా, అమృతా అరోరా భవనాల్లో నివసించే వారిని పరీక్షించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం బీఎంసీ ఆ రెండు భవనాల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ప్ర‌స్తుతం బీఎంసీ కరోనా, అమృతాలకు స‌న్నిహితంగా ఉన్న వారి స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.

కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కరీనా కపూర్ కుటుంబం సహకరించడం లేదని, సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారో చెప్పడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపించారు. కరీనా నివసించే భవనాన్ని సీల్ చేసిన అధికారులు అక్కడి వారికి పరీక్షలు నిర్వహించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కరీనా కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతున్నారని, ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, సేకరించిన నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు.

కరీనా కపూర్ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె చాలా బాధ్యతాయుతమైన పౌరురాలని, లాక్‌డౌన్ సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే కరీనా క్వారంటైన్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు.