More

    ఉత్తరప్రదేశ్ లో కప్పా వేరియంట్ కలకలం.. టెన్షన్ వద్దన్న అధికారులు..!

    కరోనా వైరస్ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ కొత్త రూపం సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే..! అలా జన్యు ఉత్పరివర్తనాలకు గురయ్యి పుట్టినవే డెల్టా, డెల్టా ప్లస్.. లాంటి వేరియంట్లు. ప్రపంచం లోని చాలా దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి.. పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఇది కప్పా వేరియంట్ అని చెబుతూ ఉన్నారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని భావిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్ ను నిర్ధారించారు.

    కప్పా వేరియంట్‌ పాజిటివ్‌ నిర్ణారణ అయిన 66 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు. జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో కప్పా వేరియంట్ ను గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కి పంపించారు. మే 27 న కోవిడ్ -19 కు పాజిటివ్ నిర్ధారణ కాగా, జూన్ 12 న గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న కన్నుమూశాడని కాలేజీ మైక్రోబయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధృవీకరించారు. కరోనా కొత్త వేరియంట్ ను రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని చెప్పుకొచ్చారు.

    లక్నోలోని కెజిఎంయు హాస్పిటల్ లో మొత్తం 109 శాంపిల్స్ పరీక్షించారు. అందులో 107 మందికి డెల్టా వేరియంట్ సోకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించారు. మరో ఇద్దరికి కప్పా సోకినట్టు నిర్ధారించారు. కప్పా వేరియంట్ ను మొదటిసారిగా గతేడాది అక్టోబర్ లో మనదేశంలోనే గుర్తించారు. ఇప్పటి వరకు వరల్డ్ హెల్త్ ఆర్గగనైజేషన్ దీనిని ప్రమాదకరమైన వేరియంట్ జాబితాలో చేర్చలేదు.

    Trending Stories

    Related Stories