సీనియర్ నేత, న్యాయకోవిదుడు కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ వేసిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన.
మే 16న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని స్వయంగా ఆయన మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభ ఎన్నికల కోసం కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ ఫైల్ చేశారు కపిల్ సిబల్. అంతకుముందు సమాజ్‌వాదీ సీనియర్ నేత ఆజాంఖాన్.. కపిల్ సిబల్ పార్టీ నుంచి బయటకు వచ్చే విషయాన్ని ధృవీకరించారు. అంతేకాదు సిబల్‌ది సరైన నిర్ణయమని చెప్పారు. ఇదిలా ఉంటే.. కపిల్ సిబల్ నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. సుప్రీంకోర్టులో కీలక కేసుల్ని వాదించడంతో పాటు న్యాయవ్యవస్థలో పలు ఉన్నత పదవులు చేపట్టారు ఆయన. కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న సిబల్.. గతంలో కేంద్రమంత్రిగానూ పని చేశారు.
ఇదిలా ఉంటే.. కపిల్ సిబల్ నామినేషన్‌పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్లు ఆయన తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. మొదటి నమోదు పూర్తయింది. రాజ్యసభకు మరో ఇద్దరి పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.