పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు.. శోక సంద్రంలో కర్ణాటక

ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు మొదట తెలిపారు. వైద్య బృందం పునీత్ ను కాపాడాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన మరణించారని అధికారిక ప్రకటన వచ్చింది. పునీత్ ఆసుపత్రిపాలైన విషయం తెలుసుకుని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పునీత్ వయసు 46 సంవత్సరాలు. ఆసుపత్రికి పలువురు సెలెబ్రిటీలు చేరుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏడుస్తూ బయటకు వస్తున్నారు.
1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్ 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన కన్నడ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. పునీత్ చికిత్స పొందిన విక్రమ్ ఆసుపత్రి ఎదుట అభిమానులు గుండెలు బాదుకుంటూ భోరున విలపిస్తున్నారు. పునీత్ కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.