మోదీ అధికారంలోకొచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చింది: కంగనా రనౌత్

0
1263

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ మరో సారి తన మనసులోని మాటలు చెప్పారు. 1947లో భారత్‌కు లభించింది స్వాతంత్య్రం కాదు భిక్ష అని చెప్పారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ‘1947లో భారత్‌కు వచ్చింది స్వాతంత్య్రం కాదు.. భిక్ష మాత్రమే. ఆ విధంగా దొరికిన దాన్ని స్వాతంత్య్రంగా పరిగణిస్తామా? ఇన్నాళ్లూ కాంగ్రె స్‌ హయాంలో బ్రిటిష్‌ పాలన కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది’ అని ఓ ఛానల్ తో కంగనా చెప్పుకొచ్చింది. రెండు రోజుల క్రితమే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఓ జాతీయ చానల్‌కు కంగనా ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ వ్యాఖ్యలపై ఆమెను కొన్ని పార్టీలు, రాజకీయ నాయకులు టార్గెట్ చేశారు. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ‘ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా.. లేదా దేశద్రోహంగా భావించాలా..’ అని మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమె వ్యాఖ్యలను దేశద్రోహంగా పేర్కొంది. ప్రభుత్వం ఆమెకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

శివసేన నేత ప్రియాంకా చతుర్వేది కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించిన కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకురాలు ప్రీతి శర్మ మేనన్‌ ముంబై పోలీసులను కోరారు. ఈ వ్యాఖ్యలను ఆప్‌ తీవ్రంగా ఖండిస్తోందని ట్వీట్‌ చేశారు.

సీపీఐ నేతలు కంగనాపై విమర్శలకు దిగారు. సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ కంగన ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అని ఆయన అన్నారు. పద్మశ్రీ అవార్డు ఆమెకు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఆమెకు లేదని అన్నారు. మోదీ వచ్చాకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. దేశ ప్రజలకు కంగన తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.