More

    కాందహార్ ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు

    ఆఫ్ఘనిస్తాన్ యొక్క రెండవ అతిపెద్ద నగరం కాందహార్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకుందని ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులు శుక్రవారం తెలిపారు. దక్షిణాన లష్కర్ గాహ్, వాయువ్యంలో ఖాలా-ఇ-నౌ పట్టణాలను కూడా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.కొన్ని రోజుల పాటు ఘర్షణల తర్వాత పశ్చిమాన మూడవ అతిపెద్ద నగరం హెరాత్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. హెరాత్ విమానాశ్రయాన్ని కూడా తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ నగరాన్ని విడిచివెళ్లిపోయినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాందహార్ ను పూర్తిగా అధీనంలోకి తీసుకున్నామని, ముజాహిదీన్లు మార్టిర్స్ స్క్వేర్ కు చేరుకున్నారని తాలిబన్ ప్రతినిధి చెప్పారు.

    కాందహార్.. తాలిబాన్ల ప్రస్థానం కాందహార్ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే..! ఈ ప్రాంతం వారికి కంచుకోటలా ఉండేది. ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఈ నగరానికి వ్యూహాత్మకంగానూ ప్రాధాన్యముంది. కాందహార్‌పై తాలిబాన్లు పట్టు నిలుపుకోవడం వారికి ఒక పెద్ద విజయం లాంటిది. తాలిబాన్లు బుధవారం నాటికే కాందహార్ సెంట్రల్ జైలుని ఆక్రమించారు. గురువారం నగరం మధ్యలోకి తాలిబన్లు ప్రవేశించారు. ఈ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. 20 ఏళ్ల సైనిక కార్యకలాపాల తర్వాత అమెరికా, ఇతర విదేశీ దళాలు వైదొలగడంతో తిరుగుబాటుదారులు ప్రతి రోజూ కొత్త భూ భాగాలను ఆక్రమిస్తూ వస్తున్నారు. మరో వైపు తమ సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు 3,000 మంది భద్రతా సిబ్బందిని పంపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. మరో తమ పౌరులను సురక్షితంగా తీసుకు వెళ్లేందుకు బ్రిటన్ కూడా 600 మంది జవాన్లను పంపనుంది. ఖాలా-ఐ-నవ్ నగరం కూడా తాలిబన్ల వశమయ్యింది. ఇప్పుడు దేశంలోని ప్రాంతీయ నగరాల్లో మూడో వంతు, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ భాగం తాలిబన్ల పాలనలోకి వెళ్లిపోయింది.

    లొంగిపోతున్న ఆఫ్ఘ‌న్ ద‌ళాల‌ను తాలిబ‌న్లు చంపేస్తున్నార‌ని కాబూల్‌లో ఉన్న అమెరికా ఎంబ‌సీ తెలిపింది. యుద్ధ నేరాలు జ‌రుగుతున్న‌ట్లు అమెరికా తెలిపింది. గ‌డిచిన నెల రోజుల్లో ఆఫ్ఘ‌నిస్తాన్ సుమారు వెయ్యి క‌న్నా ఎక్కువ మంది సాధార‌ణ పౌరులు మ‌ర‌ణించిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది ప్ర‌జ‌లు కూడా భ‌యంతో ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్నారు.

    ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్లతో కలిసి అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమైందనే కథనాలు కూడా వస్తున్నాయి. మధ్యవర్తిగా ఉన్న ఖతర్‌ ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తోంది. తాలిబన్లు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే అధికారం వారి హస్తగతం అవుతుంది. గజ్నీ పట్టణాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. గజ్నీలోని ఎక్కువ భాగం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని, నగర శివార్లలోని ఒక పోలీస్ బేస్ మాత్రమే అఫ్గాన్ భద్రతా దళాల నియంత్రణలో ఉంది.

    Related Stories