సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన కంగన

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కలిశారు. కంగనా రనౌత్ కొత్త చిత్రం ‘తేజస్’ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ను కంగనా లక్నోలో కలిశారు. షెడ్యూల్ పూర్తయిన అనంతరం లక్నో వచ్చిన కంగన ముఖ్యమంత్రి యోగిని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి ఆమెకు అరుదైన బహుమతిని అందజేశారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం భూమి పూజలో ఉపయోగించిన శ్రీరామచంద్రుడి నాణేన్ని ఆమెకు బహుమతిగా అందించారు.
యోగి ఆదిత్యనాథ్ కంగనా రనౌత్‌కు ఇచ్చిన వెండి నాణెం ఆగష్టు 5, 2020 న జరిగిన రామ మందిరం యొక్క భూమి పూజలో ఉపయోగించబడింది. పవిత్రమైన అయోధ్య భూమిని సందర్శించడానికి కంగనా రనౌత్ ను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం అయిన ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ODOP) బ్రాండ్ అంబాసిడర్‌గా కంగనా రనౌత్ ను నియమించారు. ఈ పథకం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి జిల్లాకు చెందిన బియ్యం, నల్ల ఉప్పు, జరా జార్డోజీ వంటి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.
అదనపు చీఫ్ సెక్రటరీ ఈ భేటీపై స్పందించారు. “ప్రముఖ నటి కంగనా రనౌత్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని కలిశారు, ఆమెకు ఓడిఓపి ఉత్పత్తిని అందజేశారు. ఇకపై కంగనా జీ ODOP కి మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు” అని తెలిపారు. కంగనా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యోగి ఆదిత్యనాథ్ తో భేటీని ప్రస్తావించింది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోని అత్యంత ప్రియమైన మరియు ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరని కంగనా రనౌత్ తెలిపింది. అలాగే తనకు బహుమానంగా ఇచ్చిన కాయిన్ ను కూడా షేర్ చేసింది. యోగి ఆదిత్యనాథ్ కు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్పింది.