ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్లలో చాలా మంది చైన్ స్నాచర్లుగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే..! అలా కిరాణా దుకాణానికి వచ్చి కళ్లలో కారం కొట్టి గొలుసు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగను ఖంగు తినిపించింది ఓ మహిళ..! ఆ మహిళ అతడు తెచ్చిన కారాన్నే అతడి కళ్లలో కొట్టి అతడిని పట్టుకుంది. తెలంగాణలోని కామారెడ్డిలో ఈ ఘటన చోటు చేసుకున్నాయి.
ఇలాంటి ఘటనలు జరిగే సమయంలో చాలా మంది షాక్ అవుతూ ఉంటారు. కానీ అక్కడే ఉన్న ఓ మహిళ మాత్రం తెగువ చూపించింది. ఇప్పుడు ఆ మహిళను శభాష్ అంటూ మెచ్చుకుంటూ ఉన్నారు. శివాజీరోడ్డు చౌరస్తా వద్ద ఉన్న కిరాణా దుకాణానికి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి చిప్స్ ప్యాకెట్ కావాలని అడిగాడు. ఆమె తీసి ఇస్తున్న సమయంలో జేబులోంచి కారం పొడి తీసి ఒక్కసారిగా ఆమె కళ్లలో కొట్టాడు. బాధతో ఇబ్బంది పడుతున్న సమయంలో మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకుని బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కిరాణషాపునకు వచ్చిన భారతి అనే మహిళ దొంగను చూసి వెంటనే అప్రమత్తమైంది. కిందపడి ఉన్న కారం పొట్లాన్ని అందుకుని అందులో కారం తీసి దొంగ కళ్లలో కొట్టింది. అతడు మంటతో అల్లాడుతున్న సమయంలో పట్టుకుని కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని సదాశివనర్‌కు చెందిన యాదగిరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.