More

    వ్యాక్సిన్ వేయించుకోనంటూ నాగుపాముతో బెదిరింపులకు దిగిన మహిళ

    ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో మొదలైంది. ఒకప్పుడు భారత్ లో వ్యాక్సినేషన్ అనుకున్న సమయానికి కుదరదు అని అన్న నోళ్లే ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ మీద అపోహలు ఉన్న కొందరు వ్యాక్సిన్లను వేసుకోడానికి ముందుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకే వెళ్లి వ్యాక్సిన్ లను వేస్తూ ఉన్నారు. కొందరు వ్యాక్సిన్ కి భయపడి పారిపోతూ ఉన్నారు కూడా.. అయితే ఓ మహిళ నాకు కానీ వ్యాక్సిన్ వేశారంటే పాముతో కరిపించి చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగింది.

    రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పాములను పట్టి ఆడించే కమలా దేవి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లగా టీకా తీసుకునేందుకు ఆమె నిరాకరించింది. వైద్య సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా బుట్టలో నుంచి ఒక పామును బయటకు తీసి.. తన ఇంటి నుంచి వెళ్లకపోతే పామును వారిపైకి విసురుతానని ఆమె బెదిరింపులకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కమలా దేవి ఇంటికి వచ్చారు. దీంతో వైద్య సిబ్బంది స్థానికుల సహాయం కోరారు. వారంతా ఆమెకు నచ్చజెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీంతో కమలా దేవి మనసు మార్చుకుంది. చివరకు టీకా వేయించుకుంది. ఆమెతో పాటూ.. ఇంకొంత మంది కూడా వ్యాక్సిన్లను వేయించుకున్నారు.

    భారతదేశంలో కొత్త‌గా 15,981 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 17,861 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,33,99,961కు చేరింది. నిన్న క‌రోనాతో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,51,980 కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 3,40,53,573గా నమోదైంది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,01,632 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక దేశంలో గత 24 గంటల్లో 8,36,118 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు భారత్ లో వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 97,23,77,045కి చేరింది.

    Related Stories