పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కమల హారిస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..! పలువురు ప్రముఖులతో కీలకమైన భేటీలను మోదీ నిర్వహిస్తూ ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో మోదీ సమావేశమయ్యారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై కమలా హారిస్ ప్రస్తావించారు. పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్, అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని పాక్ ను డిమాండ్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని కమల చెప్పారని విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శృంగాలా తెలిపారు. పాక్ అండగా ఉంటున్న ఉగ్రవాద సంస్థలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందంటూ ఆమె అభిప్రాయపడ్డారన్నారు. కమలా హారిస్, ప్రధాని మోదీలు గంట పాటు మంతనాలు జరిపారు. భారత్–అమెరికా వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, పరస్పర ప్రయోజనాలున్న అంతర్జాతీయ అంశాలు, ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, ఇండో–పసిఫిక్ లో పరిస్థితులపై చర్చించారు. ఉగ్రవాదం అంశం చర్చకు వచ్చినప్పుడు కమలా హారిస్ స్వయంగా ఉగ్రవాదంలో పాక్ పాత్రను ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కమలా హారిస్ కు కొన్ని అమూల్యమైన బహుమతులను ఇచ్చారు. ఆమె తాత గారు పీవీ గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్ల కాపీని వుడెన్ హ్యాండిక్రాఫ్ట్ ఫ్రేమ్‌లో పెట్టి ఆమెకు ఇచ్చారు. పీవీ గోపాలన్ గౌరవప్రదమైన సీనియర్ ప్రభుత్వాధికారి. ఆయన వివిధ పదవులను నిర్వహించారు. ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ల కాపీని కమల హారిస్‌కు మోదీ ఇచ్చారు. గులాబీ మీనాకారి చదరంగం సెట్‌ను కూడా మోదీ ఆమెకు అందించారు. అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో తయారు చేయించారని తెలుస్తోంది. దీనిలోని ప్రకాశవంతమైన రంగులు కాశీ విశిష్టతను తెలియజేస్తాయి. గులాబీ మీనాకారి అనేది అద్భుతమైన వృత్తి.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీకి సంబంధించినది. ఈ బహుమతులను చూసి కమల ఎంతో ఆనందించారు.




