భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఫోన్ చేశారు. భారత్ లో యజ్ఞంలా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అమెరికా అండగా నిలుస్తుందని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. భారత్ కు అమెరికా పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా గ్లోబల్ వ్యాక్సిన్ స్ట్రాటజీలో భాగంగా భారత్‌కు 25 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గ్యాటిమాల అధ్యక్షుడు అలెజండ్రో గియమట్టై,మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెడార్,కరేబియన్ కమ్యూనిటీ ఛైర్మన్ కీత్ రౌలేలతో కమలా హ్యారిస్ ఫోన్ లో మాట్లాడారు.
అమెరికా ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలకు భారతప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు వ్యాక్సిన్ సరఫరా ఇస్తామని ఇచ్చిన హామీకి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నానన్నారు. భారత్-అమెరికా మధ్య వ్యాక్సిన్ సహాయ,సహకారాల బలోపేతానికై సాగుతున్న ప్రయత్నాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. కోవిడ్ అనంతరం అంతర్జాతీయ సమాజపు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని పునరుద్దరించేందుకు రెండు దేశాల భాగస్వామ్య సామర్థ్యంపై చర్చించినట్లు తెలిపారు.
వ్యాక్సిన్ కవరేజీని మరింత విస్తృతం చేయడం, అత్యవసర పరిస్థితులు,ప్రజారోగ్య అవసరాలపై స్పందించడం,వ్యాక్సిన్లు కోరే దేశాల్లో వీలైనన్ని దేశాలకు సహాయం చేయడంపై దృష్టి సారించినట్లు కమలా హ్యారిస్ చెప్పారని ఆమె సీనియర్ అడ్వైజర్ సైమోన్ సాండర్స్ తెలిపారు.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లను కనుగొన్న వెంటనే అమెరికా పెద్ద ఎత్తున ఆర్డర్లను ఇచ్చేసింది. ఆ దేశ జనాభాకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల కంటే ఎక్కువగానే వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకుంది. అమెరికా వద్ద 8 కోట్ల డోస్‌ల టీకాలు అదనంగా ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ లను జూన్ నెలాఖరు నాటికి ప్రపంచ దేశాలకు పంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తొలి విడతగా 2.5 కోట్ల డోస్‌లను పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 1.9 కోట్ల డోసులను దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు అందజేయనున్నారు. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు 60 లక్షలు, దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు 70 లక్షలు, ఆఫ్రికాకు 50 లక్షల డోసులు సరఫరా చేయనుంది అమెరికా. మిగతా 60 లక్షల డోస్‌లను భారత్, మెక్సికోలతో పాటు కెనడా, దక్షిణ కొరియాలకు సరఫరా చేయనున్నారు. ‘గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్’ లో భాగంగా అమెరికా ఈ వ్యాక్సిన్ల సరఫరాను చేపట్టింది.