నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని హాస్పత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కమల్ చెన్నైలోని పోరూరు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటాయని అందుకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. తమ అభిమాన నటుడు ఆస్పత్రిలో చేరాడన్న విషయం తెలియగానే ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కమల్ కు జ్వరం వచ్చిందని.. చికిత్స తీసుకుంటూ ఉన్నాడని తెలిపారు. మరో రెండు రోజులు ఆయనకు పూర్తి విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే కమల్ హాసన్ హైదరాబాద్‌లో తన గురువు, లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన కమల హాసన్ నేరుగా కళాతపస్వి కె విశ్వనాథ్ ఇంటికెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకుని ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్యం గురించి కమల్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కమల హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, గురువుగారిని వాళ్లింట్లో కలిశానని, ఎన్నో మధురస్మృతులను గుర్తుచేసుకున్నామనీ, వారంటే ఎంతో గౌరవమనీ చెప్పుకొచ్చారు.