గత ఏడాది డిసెంబరులో పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేషపూరిత ప్రసంగం చేశాడనే ఆరోపణలతో హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు పూణేలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం (జనవరి 8) బెయిల్ మంజూరు చేసింది. 25,000 బెయిల్ బాండ్ ఇవ్వాలని కాళీచరణ్‌ను కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని, చార్జిషీటు దాఖలు చేసే వరకు నెలకోసారి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని కోరారు.
కాళీచరణ్ మహారాజ్ తన లాయర్ అమోల్ డాంగే ద్వారా బెయిల్ దరఖాస్తును సమర్పించారు. ప్రాసిక్యూషన్ లాయర్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. కాళీచరణ్‌ను తీవ్రమైన నేరానికి అరెస్టు చేశారని, ఐపిసిలోని నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కాళీచరణ్ ఒకసారి బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆందోళనలను ప్రేరేపించడానికి ప్రయత్నించవచ్చని ప్రాసిక్యూషన్ వాదించింది. అంతేకాకుండా, కాళీచరణ్ స్థానిక నివాసి కాదని.. పారిపోవచ్చని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపింది.
డిసెంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ధర్మ సంసద్’ కార్యక్రమంలో మహాత్మా గాంధీని విమర్శించినందుకు కాళీచరణ్ మహారాజ్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. రాయ్‌పూర్ ధర్మ సంసద్‌లో చేసిన వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో కాళీచరణ్ మహారాజ్ వార్తల్లో నిలిచారు. ఆయన మహాత్మా గాంధీని విమర్శించారు. రాయ్‌పూర్ పోలీసులు ఆయనను ఖజురహో నుంచి అరెస్టు చేశారు. ధర్మ సంసద్‌లో గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేని అభినందిస్తూ కాళీచరణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా పలుచోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాళీచరణ్ మహారాజ్ గాంధీజీని దుర్భాషలాడడమే కాకుండా గాంధీజీని చంపినందుకు నాథూరామ్ గాడ్సేకి కృతజ్ఞతలు తెలిపారు.