More

  హిందూ ధర్మ కర్త కాళీచరణ్ మహరాజ్ అరెస్ట్

  మధ్యప్రదేశ్‌లోని ఖజురహోకు చెందిన హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహాత్మా గాంధీని కించపరుస్తూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ధర్మ సంస‌ద్ వేదిక‌గా ఆయ‌న పలు వ్యాఖ్య‌లు చేశారు. కాళీచరణ్ మహారాజ్ పై రాయ్‌పూర్‌లోని తిక్రపారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని అధికారులు గురువారం తెలిపారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేశ్వర్ ధామ్ సమీపంలో కాళీచరణ్ మహరాజ్ అద్దెకు ఉంటున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు రాయ్‌పూర్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని.. సాయంత్రానికి, పోలీసు బృందం రాయ్‌పూర్ చేరుకుంటుందని ఎస్పీ రాయ్‌పూర్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.

  డిసెంబర్ 26న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేని అభినందిస్తూ కాళీచరణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ కారణంగా ప‌లుచోట్ల ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రెండు రోజుల ‘ధరం సంసద్’ జరిగింది. స్వామి పరమాత్మానంద, రామప్రియా దాస్, త్రివేణి దాస్, హనుమాన్ గాధి అయోధ్యకు చెందిన మహంత్ రాందాస్, సాధ్వి విభా దేవి, పాత అఖారాకు చెందిన స్వామి ప్రబోధానంద్, అకోలాకు చెందిన కాళీచరణ్‌తో సహా పలువురు సాధువులు ‘ధరం సంసద్’లో పాల్గొన్నారు.

  కాళీచరణ్ మహారాజ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని దూషించారు. దీంతో కాళీచరణ్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కాళీచరణ్ మహారాజ్ గాంధీజీని దుర్భాషలాడడమే కాకుండా గాంధీజీని చంపినందుకు నాథూరామ్ గాడ్సేకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కాళీచరణ్ మహరాజ్‌పై కేసు నమోదైంది. పోలీసులు అతనిపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 మరియు 505 (2) కింద తిక్రపారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రాయ్‌పూర్ మాజీ మేయర్, చైర్మన్ ప్రమోద్ దూబే కాళీచరణ్‌పై కేసు పెట్టారు.

  Trending Stories

  Related Stories