90కి పెరిగిన కాబూల్ ఎయిర్ పోర్ట్ మృతుల సంఖ్య

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో గురువారం జరిగిన జంటపేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 90కి పెరిగింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గేటు వద్ద జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఆత్మాహుతి దాడులపై ప్రపంచం మొత్తం కలవర పడుతోంది. ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. తొలి పేలుడు ఎయిర్ పోర్టులోని అబ్బే గేటు వద్ద జరగ్గా, రెండో పేలుడు బేరన్ హోటల్ వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో అమెరికా మెరైన్ కమాండోలు కూడా ఉండడంతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో అమెరికా అధినాయకత్వాన్ని రెచ్చగొట్టే చర్యగా రక్షణ రంగ నిపుణులు ఈ పేలుళ్లను అభివర్ణిస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై అమెరికా నిఘా వర్గాలు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది.
కాబూల్‌లో రక్తపాతం సృష్టించిన వరుస పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది చనిపోయారు. వందల్లో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత విమానాశ్రయం వద్ద కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగ్గా ఆ తర్వాత కొన్ని గంటలకు సెంట్రల్ కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాజాగా ప్రకటించిన ఐసిస్ అబే గేటు వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్ ఫొటోను కూడా విడుదల చేసింది.