తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నిస్తూ ఉంది. మరో వైపు కాంగ్రెస్ కూడా తిరిగి ఫామ్ లోకి రావాలని తహ తహ లాడుతూ ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తానే అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవమత ప్రబోధకుడు ముందుకు వచ్చారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కేఏ పాల్ ఈ రోజు సమావేశమయ్యారు. ఆమెతో పలు అంశాలపై చర్చించిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందని, ఇంత అవినీతిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. కేసీఆర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయని, ఆయన అక్రమ పాలనను అంతం చేయడానికే తాను అమెరికా నుంచి వచ్చినట్లు చెప్పారు. కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిశోర్ చెప్పారని కేఏ పాల్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తానే తీసుకు వచ్చానని, తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ విజయనగరం నుంచి వస్తే, తాను విశాఖపట్నం నుంచి వచ్చినట్లు తెలిపారు.
గతంలో ఏపీలో ఎన్నికల సమయంలో పాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్ ను ఓడించబోతున్నామని చెప్పడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తాను. తనతో కలవమని అడగడం కూడా తెలిసిందే..! ఇక ఇటీవలే తగ్గేదే లేదు.. ఉక్రెయిన్-రష్యా మధ్య వార్ ను ఆపబోతున్నాం అంటూ వీడియో పెట్టడం.. అది వైరల్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఏది ఏమైనా కేఏ పాల్ రాజకీయ సందడి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తగ్గడం లేదు.