కేసీఆర్ ముక్త్, బీజేపీ ముక్త్, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేస్తా: కేఏ పాల్

0
757

మునుగోడు ప్రజలు నాపై ఎనలేని ప్రేమ చూపించారని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌, మునుగోడు అభ్య‌ర్ధి కేఏ పాల్ అన్నారు. నల్గొండలో ఆయ‌న‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడులో గెలిస్తే నెక్ట్స్‌ తెలంగాణ సీఎం నేనే అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు మూడు సార్లు నాపై దాడికి యత్నించారని ఆరోపించారు. లక్షా 10 వేల ఓట్లు ఉంగరం గుర్తుకు పడ్డాయి.. పూర్తి లెక్క నా దగ్గర ఉంద‌ని తెలిపారు. 50 వేల మెజారిటీతో నేను గెలవబోతున్నా.. నా గెలుపు రాష్ట్ర, దేశ రక్షణకు తొలి మెట్టు అని అన్నారు. కేసీఆర్ ముక్త్, బీజేపీ ముక్త్, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేస్తానని కేఏ పాల్ జోస్యం చెప్పారు.

రాత్రి ఈవీఎంలతో వచ్చిన ట్రక్.. అనుకోకుండా మాయమైందని.. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం గోల్ మాల్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే తాను 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు పంచినా.. తాను మాత్రం ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక అని కేఏ పాల్ పేర్కొన్నారు. ‘‘ నేను స్వయంగా వంద బూత్ లను పరిశీలించా.. నాకు 1లక్ష 10వేలు పడ్తాయి.. నాపై నమ్మకం ఉంచిన ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసపాత్రుడిగా ఉంటా..’’ అని కేఏ పాల్ అన్నారు. అసలు కేసీఆర్ ఎవరు..? తెలంగాణ ద్రోహి, నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తారా..? ఆయనేమైనా అంబేద్కర్ నా..? కేఏ పాల్ నా..? అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ఓడిపోతున్నానని కేసీఆర్ కు అర్థమైందన్నారు. దేశంలో బీజేపీ ఈడీ, సీబీఐలను వాడుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం సీబీసీఐడిని వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను అభివృద్ది చేద్దామంటే.. ఎందుకు ముందుకు రావట్లేదు.. ? మునుగోడు లో అసలు ఏమైనా అభివృద్ది జరిగిందా..? అని కేఏ పాల్ ప్రశ్నించారు. నిన్న ఉపఎన్నిక జరిగితే.. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ ఏంటి..? కోర్టు చెప్పినా.. ఎందుకు సెక్యూరిటీ, గన్ మేన్లను ఇవ్వట్లేదు. మీ బహిరంగ సభలో జనాలు ఎక్కడైనా ఉన్నారా..? ఆ టైమ్ లో అంతా నా దగ్గర 40వేల మందికి పైగా ఉన్నారని అన్నారు. కేఏ పాల్ సీఎం, సీఎం అంటూ స్లోగన్ చేస్తుంటే.. ఎస్పీ హడలిపోయారు… ప్రపంచంలోని ఎందరో నియంతలను చూశా.. కేసీఆర్ లాంటి వారిని మాత్రం చూడలేదని అన్నారు.