తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.
అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమని.. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని చెప్పారు.
విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారని.. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయని అన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పారు.
ప్రముఖ సినీ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసిందని.. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని.. పితృ సమానులైన ఆయన ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆయన గొప్పదనాన్ని చెప్పటానికి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశష్టమైనదని అన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలింలను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు ఇంకొకరు లేరని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహాదర్శకుడు అని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం తనకు లభించిందని.. తనకు వ్యక్తిగతంతో ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధం అని, అంతకు మించి తండ్రీకొడుకుల అనుబంధమని చెప్పారు. ఆయనతో గడిపిన సమయం తనకు అత్యంత విలువైనదని అన్నారు. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయడం ఒక విద్య లాంటిదని చిరంజీవి చెప్పారు. ఆయన చిత్రాలు భావి దర్శకులకు ఒక గైడ్ లాంటివని అన్నారు. 43 సంవత్సరాల క్రితం ఆయన తీసిన ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారని అన్నారు. ఆయన చిత్రాలు, చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవని చిరంజీవి కొనియాడారు. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నానని చెప్పారు.